ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణిత్ రావు పాత్ర
దిశ దశ, హైదరాబాద్:
ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదట్లో ససేమిరా అన్న ప్రణిత్ రావు ఆ తరువాత సరేనన్నాడని తెలుస్తోంది. ఈ మేరకు పోలీసు కస్టడీలో ఉన్న పోలీసు అధికారులు వాంగ్మూలం ఇచ్చినట్టుగా సమాచారం. ఐదు రోజుల కస్టడీ ముగిసిన తరువాత పోలీసు అధికారులు భుజంగరావు, తిరుపతన్నలకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరు పరిచారు పంజాగుట్ట పోలీసులు. వీరికి ఈ నెల 6 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. కస్టడీకి ఇచ్చినప్పుడు పోలీసు అధికారులు వీరిద్దరిచ్చిన కన్ఫెషన్ కు సంబంధించిన రిపోర్టు కూడా కోర్టుకు సమర్పించారు. ఇందులో ప్రణిత్ రావు అక్రమ వ్యవహారానికి ముందుకు సమ్మతించలేదని అధికారులు చెప్పినట్టుగా వివరించారు. ఆ తరువాత తప్పని సరి పరిస్థితుల్లోనే ప్రణిత్ రావు వీరు అడిగిన వారి వివరాలను సేకరించి అప్పగించినట్టుగా చెప్పారు.
ఆధారాల సేకరణ…
మరో వైపున డిసెంబర్ 4న మూసీలో పడేసిన హార్డ్ డిస్కులకు సంబంధించిన ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఐదు ధ్వంసం అయిన హార్డ్ డిస్క్ కేసులు, మిషన్ తో కట్ చేసిన 9 హార్డ్ డిస్క్ ముక్కలు, అలాగే బురదలో కూరుకపోయిన 6 మెటల్ హార్డ్ డిస్కులకు సంబంధించిన ముక్కలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వివరించారు. ప్రణిత్ రావు ఇచ్చిన సమాచారం మేరకు మూసీ నదితో పాటు ఎస్ఐబీ కార్యాలయంలో కూడా సోదాలు చేసి ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ 12 కంప్యూటర్లు, 7 సీపీయూలు, ల్యాప్ టాప్, మానిటర్, పవర్ కేబుళ్లతో పాటు ఎలక్ట్రిషియన్ గదివలో ముక్కలైన హార్డ్ డిస్క్ పొడిని రికవరీ చేశారు. ఎస్ఐబీ ఆపీసు ఆవరణలోని జనరేటర్ వద్ద కాల్చిన సీడీఆర్ వివరాలకు సంబంధించిన డాక్యూమెంట్లు, స్పెరల్ బైండింగులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐబీ కార్యాలయం సీసీ ఫుటేజీ, లాగ్ బుక్ కు సంబంధించిన పేపర్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. బీఆర్ఎసేతర పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల నగదు పంపిణీపై అక్రమ నిఘా పెట్టమాని ఎస్ఐబీ కానిస్టేబుల్ కొత్త నరేష్ గౌడ్ వాంగ్మూలం ఇవ్వగా తాము నేరం చేశామని తిరుపతన్న, భుజంగరావులు నేరం అంగీకరించినట్టుగా అందులో పేర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తులపై అక్రమంగా నిఘా పెట్టడంలో వీరిద్దరి కుట్ర ఉందని కూడా అందులో వివరించారు.
రేపటికి వాయిదా…
ప్రణిత్ రావు బెయిల్ పిటిషన్ పై విచారించిన నాంపల్లి కోర్టు విచారించగా కౌంటర్ దాఖలు చేస్తామని పోలీసుల తరుపు న్యాయవాది వివరించడంతో రేపటికి వాయిదా వేసింది. అలాగే మాజీ డీసీపీ రాధా కిషన్ రావు పోలీస్ కస్టడీ పిటిషన్ పై ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు నిర్ణయాన్ని రేపు వెల్లడిస్తామని పేర్కొంది.