త్రివేణి సంగమ క్షేత్రంలో సరికొత్త వసూళ్లు… ఆందోళన వ్యక్తం చేస్తున్న వాహనదారులు

దిశ దశ, కాళేశ్వరం:

త్రిలింగ క్షేత్రమైన కాళేశ్వరం మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయితీ నిబంధనలకు అనుగుణంగా కాంట్రాక్టర్ వ్యవహరించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు. పుణ్య స్నానాలు ఆచరించేందుకు గోదావరి నదికి, దర్శనాలు చేసుకునేందుకు ఆలయానికి వెల్లే భక్తులు ప్రయాణించే వాహనాల నుండి ఫీజు వసూలు చేయడం సమంజసంగా ఉంటుంది కానీ కాళేశ్వరం మీదుగా వెల్లే ప్రతి వాహనం వద్దా వసూలు చేస్తున్న తీరుపై విస్మయం వ్యక్తం అవుతోంది.

నిబంధనలు ఇలా…

ఎంట్రీ లేదా పార్కింగ్ ఫీజు వసూళ్ల కోసం కాళేశ్వరం పంచాయితీ గత నెలలో టెండర్లను ఆహ్వానించింది. నవంబర్ 12న విడుదల అయిన వేలం పాట నోటీసులో, 15న విడుదల అయిన ప్రొసిడింగ్స్ లో విధించిన నిబంధనలకు వాస్తవానికి పొంతన లేకుండా పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. టెండరు దక్కించుకున్న వారికి పంచాయితీ స్థలం చూపిస్తుందని అక్కడ మాత్రమే వాహనానలు పార్కింగ్ చేయించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా పార్కింగ్ స్థలాన్ని చదును చేయడంతో పాటు షెడ్ల నిర్మాణం, తాగు నీటి వసతులు కల్పించాల్సిన బాధ్యత కూడా టెండరు దక్కించుకున్న వారిదేనని స్పష్టం చేసింది. ఫీజు వసూలు చేసిన తరువాత ఇచ్చే రశీదు పుస్తకాలను కూడా నిర్వాహాకులే ప్రింట్ చేయించుకుని పంచాయితీకి సంబంధించిన రబ్బర్ స్టాంపులు వేయించుకోవల్సి ఉంటుందని, రిసిప్ట్ బుక్స్ అయిపోతే వాటిని జీపీలో డిపాజిట్ చేసిన తరువాత కొత్త వాటిపై ముద్రలు వేయించుకోవల్సి ఉంటుందని కూడా వెల్లడించింది. నవంబర్ 15న విడుదల చేసిన ప్రొసిడింగ్స్ లో మాత్రం ఎంట్రీ, పార్కింగ్ ఫీజు కేవలం గోదావరి నదికి, శ్రీ కాళేశ్వర, ముక్తీశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల వాహనాల నుండి మాత్రమే వసూలు చేయాలని స్పష్టంగా ఉంది. స్థానిక వాహనాలకు, ప్రభుత్వ వాహనాముల నుండి ఫీజు వసూలు చేయరాదని, జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే, కన్నెపల్లి వైపునకు, మహదేవపూర్ వైపునకు వెల్లే వాహనాలు, ఇసుక క్వారీలకు వెల్లే లారీల నుండి వసూలు చేయకూడదని స్పష్టంగా రాసి ఉంది. ఒక వేళ ఇలాంటి వాహనాల నుండి రుసుం వసూలు చేసినట్టయితే టెండర్ పాట పాడిన మొత్తం డబ్బు గ్రామ పంచాయితీకి చెల్లించాల్సి ఉంటుందని, ఆ టెండర్ ను కూడా రద్దు చేయడం జరుగుతుందన్న నిబంధన ఉంది. అలాగే ఆర్టీసీ బస్ స్టేషన్, ఈఓ ఆఫీసుకు వెల్లే మార్గంలోని కమాన్, జడ్పీ హైస్కూల్ వద్ద మాత్రమే ప్రత్యేకంగా తాళ్లు ఏర్పాటు చేసుకుని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా భక్తులు ప్రయాణించే వాహనాల నుండి ఫీజు వసూలు చేయాల్సి ఉంది.

జాతీయ రహదారి…

అయితే కాళేశ్వరాన్ని సందర్శించే భక్తుల నుండి రుసుం వసూలు చేయాలని ఏర్పాటు చేసిన ఈ విధానంలో కట్టడి చర్యలు లేకుండా పోయాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టు అప్పగించినప్పుడు విధించిన విధి విధానాలకు అనుగుణంగా టెండర్ దక్కించుకున్న నిర్వాహకులు వ్యవహరిస్తున్నారా లేదా అన్న విషయాన్ని కూడా పట్టించుకునే వారు లేకుండా పోయారు. దీంతో కాళేశ్వరం మీదుగా వెలుతున్న ప్రతి వాహనం వద్ద ఫీజు వసూలు చేస్తున్నారన్న ఆరోఫణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ నుండి మహారాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్రాలకు వెల్లే ప్రధాన రహదారి కూడా కాళేశ్వరం మీదుగానే ఉంది. ఆయా రాష్ట్రాలకు రాకపోకలు సాగించే వాహనాల నుండి ఎంట్రీ లేదా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్రకు చెందిన ప్రముఖుల కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు వారి వాహనాలను ఆపి మరీ రుసుం వసూలు చేసే వరకు వదిలిపెట్టలేదని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఇతర ప్రాంతాల నుండి కాళేశ్వరం వచ్చే పోలీసు అధికారులు, ఇతర విభాగాలకు చెందిన అధికార యంత్రాంగానికి చెందిన వాహనాలు కూడా ఫీజు చెల్లించాల్సిందేనని పట్టుబడుతున్నారని తెలుస్తోంది. మరో వైపున కాళేశ్వరానికి ఎగువ ప్రాంతంలో టీఎస్ఎండీసీ ఏర్పాటు చేసిన ఇసుక రీచులు కూడా ఉన్నాయి. ఆయా రీచుల నుండి ఇసుక తరలించే లారీ వాలాలు కూడా రుసుం చెల్లించాల్సిందేనన్న డిమాండ్ వినిపిస్తున్నారని, ఒక్కో లారీ నుండి రూ. 200 వరకు వసూలు చేస్తుండడంతో తమపై అదనపు భారం పడుతోందని డ్రైవర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో డ్రైవర్లకు, టెండర్ దక్కించుకున్న నిర్వాహకులకు సంబంధించిన వ్యక్తులకు మధ్య వాగ్వాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయని తెలిసింది. బస్ స్టేషన్ నుండి ఆలయం వైపునకు, గోదావరి నదికి వెల్లే వాహనాల నుండి మాత్రమే ఫీజు వసూలు చేసినట్టయితే బావుంటుంది కానీ కాళేశ్వరం మీదుగా రాకపోకలు సాగించే ప్రతి వాహనం నుండి కూడా ఎంట్రీ లేదా పార్కింగ్ ఫీజు వసూలు చేయడం సమంజసం కాదని వాహనదారులు అంటున్నారు. ఇకపోతే కాళేశ్వరం పంచాయితీ నిర్వహించిన ఈ టెండర్ దక్కించుకున్న నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. పార్కింగ్ స్థలంలో టెండర్ అగ్రిమెంటులో ఉన్న నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక షెడ్ల నిర్మాణం వంటివి చేపట్టలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం ఎంట్రన్స్ లోనే ప్రత్యేకంగా టోల్ గేట్ ఏర్పాటు చేసిన నిర్వహాకులు ఆ ప్రాంతం మీదుగా వెల్తున్న ప్రతి వాహనం నుండి రుసుం వసూలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నేషనల్ హైవే కావడంతో ఈ ప్రాంతం మీదుగా వెల్తున్న ప్రతి వాహనం డబ్బులు చెల్లించాల్సిందేనని నిర్వహాకులు తేల్చి చెప్తుండడంతో పాటు ఇసుక లారీల నుండి కూడా రుసుం వసూలు చేస్తున్నారని తెలుస్తోంది.

విజిలెన్స్ లేదా..?

టెండర్ ప్రక్రియ ముగిసిన తరువాత పంచాయితీ విభాగం తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తోందన్న ఆరోఫణలు వస్తున్నాయి. టెండర్ నోటీసు, అగ్రిమెంట్ ప్రకారం పాటించాల్సిన నిబందనలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారని వాహన దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయితీ స్టాంప్ లేని రశీదులు కూడా ఇస్తున్నప్పటికీ కట్టడి చేసేందుకు పంచాయితీ యంత్రాంగం చొరవ చూపకపోవడం వెనక ఆంతర్యం ఏంటన్నదే పజిల్ గా మారింది. ఇసుక లారీల నుండి వసూలు చేసిన తరువాత ఇచ్చిన రిసిప్టులపై గ్రామ పంచాయితీకి సంబంధించిన ఎలాంటి రబ్బర్ స్టాంపులు లేకపోవడం విస్మయం వ్యక్తం అవుతోంది. ముద్రలు లేని రశీదులు స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం గమనార్హం. జిల్లా పంచాయితీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి టెండర్ దక్కించుకున్న నిర్వహాకుల తీరును కట్టడి చేయాలన్న అభ్యర్థన వినిపిస్తోంది.

You cannot copy content of this page