karimnagar: కరీంనగర్ శివార్లలో నకిలీ పోలీసులు… అరెస్ట్ చేసిన కొత్తపల్లి ఖాకీలు…

దిశ దశ, కరీంనగర్:

ప్రధాన రహదారిపైనే వాహనాలను ఆపి తనిఖీలు చేస్తూ దర్జాగా వసూళ్లు చేయడం మొదలు పెట్టారు ఇద్దరు ప్రబుద్దులు. వీరి వాలకం చూసి  అనుమానించిన ఆటోవాలా ఫిర్యాదు చేయడంతో అసలు విషయంలో వెలుగులోకి వచ్చింది. కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి కథనం ప్రకారం… హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేటకు చెందిన మహమ్మద్ అజ్మత్ పాషా శుక్రవారం నలుగురు పురోహితులను తీసుకుని వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చాడు. శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అదే ఆటోలో తిరుగు ప్రయాణం అయిన వీరిని ఆసిఫ్ నగర్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు నిలువరించారు. తాము పోలీసులమని ఆటోకు సంబంధించిన ఆర్సీతో పాటు ఇతరాత్ర పేపర్లు చూపించాలని అడిగారు. మొబైల్ ఫోన్ లో ఉన్న స్మార్ట్ కాపీలను ఆటో డ్రైవర్ అజ్మత్ పాషా వారికి చూపించగా, హార్డ్ కాపీలు లేనందున ఫైన్ కట్టాలని బెదిరించడంతో అనుమానించిన అజ్మత్ వారిని ఐడెంటిటీ కార్డులు అడగడంతో వారిద్దరు అక్కడి నుండి పారిపోయారు. ఇదే సమయంలో అటుగా వెల్లిన ఇతర వాహనాలను కూడా ఆపి వీరిద్దరు డబ్బులు వసూలు చేసిన విషయాన్ని గమనించిన అజ్మత్ పాషా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు 308(3), 319(2 ) , 204 ఆఫ్ బి ఎన్ ఎస్ – 2023, సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసిన కొత్తపల్లి పోలీసులు నిందితుల గురించి ఆరా తీశారు. నిందితులు ఇద్దరు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన చెక్రాల రాజు, గొట్టెముక్కల విజయ్ లుగా గుర్తించారు పోలీసులు. వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నామని, కోర్టులో హజరు పరుస్తామని ఎస్సై సాంబమూర్తి తెలిపారు.

You cannot copy content of this page