కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా..?

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ దేనికి సంకేతం..?

దిశ దశ, హైదరాబాద్:

వికారాబాద్ కలెక్టర్ దాడి ఘటనలో అధికార బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేత కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగించే అవకాశాలు ఉన్నాయా..? తాజాగా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ ఇస్తున్న సంకేతమేంటీ..?

సీడీఆర్ తో కూపీ…

వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ నేతృత్వంలో రెండు రోజుల క్రితం ఫార్మా కంపెనీ ఏర్పాటులో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు రైతులతో పాటు స్థానికులు కొంతమంది అధికారయంత్రాంగంపై దాడి జరిపిన సంగతి తెలిసిందే. ఐఏఎస్ అధికారిపైనే దాడి జరగడాన్ని సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలను ఆధారం చేసుకున్న పోలీసులు అనుమానితులను గుర్తించారు. ఇందులో సురేష్ అనే వ్యక్తి పాత్ర అత్యంత కీలకంగా ఉందని గమనించిన పోలీసు అధికారులు అతని కాల్ డాటా రికార్డ్ (CDR) ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. దాడి ఘటనకు ముందు అనుమానితుడు సురేష్ తో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి 42 సార్లు మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇదే క్రమంలో నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ తో 6 సార్లు మాట్లాడినట్టుగా సీడీఆర్ డాటలో వెల్లడైనట్టుగా సమాచారం. పలు కేసుల్లో నిందితునిగా ఉన్న సురేష్ కు నరేందర్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయని తేల్చడంతో పాటు అతనిపై ఉన్న క్రిమినల్ కేసుల నుండి కూడా మాజీ ఎమ్మెల్యే విముక్తి కల్పించినట్టుగా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఈ ఘటన బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతల ప్రోత్సాహంతోనే జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

నరేందర్ రెడ్డి అరెస్ట్…

మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి బుధవారం ఉదయం హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికార యంత్రాంగంపై జరిగిన దాడికి ముందు ఏం జరిగింది, సురేష్ కు, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి మధ్య జరిగిన సంభాషణ ఏమిటీ అన్న వివరాలపై ఆరా తీసే అవకాశం ఉంది. అయితే నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కల్గించిన కేసుతో పాటు కుట్ర కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నట్టుగా సమాచారం. అయితే ఘటనకు ముందు సురేష్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డితో 42 సార్లు మాట్లాడుతూనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ తో 6 సార్లు మాట్లాడినట్టుగా కూడా గుర్తించడంతో ఆయనపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ దాడి ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి, సురేష్ ల కన్ఫెషన్ రిపోర్ట్ లను ఆధారం చేసుకుని కేటీఆర్ ను కూడా బాధ్యున్ని చేసే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

టెక్నికల్ ఎవిడెన్స్…

కలెక్టర్, ఇతర యంత్రాంగంపై జరిపిన దాడి ఘటనలో పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ సు ఇప్పటికే కొన్ని సేకరించగా మరికొన్నింటిని కూడా సేకరించి కోర్టులో సమర్పించే యోచనలో ఉన్నట్టుగా సమాచారం. ఇది కేవలం రైతులు కావాలనే చేసిన దాడి కాదని, కుట్ర దాగి ఉందన్న విషయాన్ని వెల్లడించేందుకు అవసరమైన ఆధారాలు సేకరిస్తున్నందున బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత కేటీఆర్ పై కూడా చర్యలు తీసుకుంటారన్న అభిప్రాయాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన పోలీసులు బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్టుగానే గుట్టు చప్పుడు కాకుండా ఈ కేసుతో సంబంధం ఉందన్న కారణంతో మిగతా వారిని కూడా ఇదే విధంగా అరెస్ట్ చేస్తారేమోనన్న అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page