ఇండ్లపై జనం… వాగువద్ద యంత్రాంగం

సహాయక చర్యలకు ఆటంకంగా వానలు

దిశ దశ, భూపాలపల్లి:

భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామం వద్ద జిల్లా కలెక్టర్ భ్రవేష్ మిశ్రాతో పలువురు జిల్లా అధికారులు హుటాహుటిన చేరుకున్నారు. గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టుడంతో స్థానికులను కాపాడేందకు సత్వర చర్యలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తం అయింది. అయితే బోట్ల సాయంతో గ్రామస్థులను కాపాడాలని భావించినప్పటికి అవి ములుగు జిల్లాలో ఉండడంతో వాటిని మోరంచపల్లికి తరలించడం ఇబ్బందికరంగా మారింది. అన్ని ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు పొంగిపొర్లుతుండడంతో బోట్లను మోరంచపల్లికి తరలించే అవకాశాలు లేకుండా పోయాయి. దీంతో గ్రామస్థులను కాపాడేందుకు ఆర్మీ హెలిక్యాప్టర్ ను రంగంలోకి దింపే యోచనలో అధికారులు ఉన్నట్టు సమాచారం. హైదరబాద్ లోని పలువురు ఉన్నతాధికారులతో చర్చలు జరిపి మోరంచపల్లి వాసులను కాపాడే ప్రయత్నంలో భూపాలపల్లి పల్లి కలెక్టర్ భ్రవేష్ మిశ్రా నిమగ్నం అయ్యారు.

గల్లంతయిన వారెందరో..?

అయితే మోరంచపల్లి వాసులను చుట్టుముట్టిన వరదల్లో ఎంతమంది గల్లంతయ్యారో అర్థం కాకుండా పోయింది. తెల్లవారే సరికి గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టడంతో గ్రామస్థులంతా బిక్కుబిక్కుమంటూ ఇండ్లపైకి చేరుకున్నారు. దీంతో మోరంచపల్లికి చెందిన వారు ఎంతమంది గల్లంతు అయ్యారో అంతుచిక్కకుండా పోయింది. ప్రత్యక్ష సాక్షులు మాత్రం 10 మందికి పైగా వరద నీటిలో గల్లంతయ్యారని చెప్తున్నప్పటికీ మరికొంతమంది నలుగురేనని చెప్తున్నారు. గ్రామంలో మాత్రం 1200 నుండి 1500 మంది నివసిస్తున్నట్టు అంచనా వేసిన అధికారులు వరద తగ్గుముఖం పడితే తప్ప అసలైన గణంకాలు వేసే అవకాశాలు లేవని అభిప్రాయపడుతున్నారు. మోరంచపల్లి ప్రధాన రహాదారిపై దాదాపు పదికి పైగా బొగ్గులారీలు కూడా నిలిచిపోయాయి. వాటిలో ఉన్న డ్రైవర్, క్లీనర్ల ఆచూకి కూడా ఇంకా లభ్యం కావడం లేదని, కొంతమంది మాత్రం ప్రాణాలతో బయటపడినట్టుగా చెప్తున్నారు.

You cannot copy content of this page