కలెక్టర్ సాబ్… మీరైనా కనికరించండి

మద్దులపల్లి రైతుల వినతి

దిశ దశ, భూపాలపల్లి:

రెండేళ్లుగా కౌలు డబ్బులు రాక, లీజ్ అమౌంట్ ఇప్పించండి సారూ అంటూ వేడుకుని విసిగి వేసారి పోయారు ఆ రైతులు. తమ భూములను వాడుకుంటూ వ్యాపారం చేసుకుంటున్నా లీజు డబ్బులు ఇవ్వకుండా కాళ్లరిగేలా తిప్పుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం తమ కౌలు డబ్బులు ఇస్తే తప్ప లారీలను కదలనిచ్చేది లేదని ఆందోళన చేసిన బాధిత రైతులు తాజాగా జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మద్దులపల్లి శివార్లలో ఏర్పాటు చేసిన ఇసుక రీచు కోసం తమ భూములు లీజుకు ఇచ్చామని రైతులు వివరించారు. రెండేళ్లుగా తమకు ఇవ్వల్సిన కౌలు డబ్బులు ఇవ్వకుండా టీఎస్ఎండీసీ అధికారులు తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమకు న్యాయం చేయాలని కోరుతు సోమవారం ప్రజావాణిలో భాగంగా జిల్లా కలెక్టర్ భ్రవేష్ మిశ్రాకు వినతి పత్రం అందించారు. ఇసుక రీచులకు లీజుకు ఇవ్వడం వల్ల వ్యవసాయం కూడా చేసుకోలేని పరిస్థితి తయారైందని, దీంతో తమ కుటుంబాల పోషణ భారమవుతున్నందున కౌలు డబ్బులు ఇప్పించాలని బాధిత రైతులు కలెక్టర్ ను వేడుకున్నారు. రెండు రోజుల్లో లీజ్ అమౌంట్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని కలెక్టర్ రైతులకు మాట ఇచ్చారు.

You cannot copy content of this page