నా దృష్టిలో లేకుండా ప్రజావాణికి డుమ్మా కొట్టొద్దు… జిల్లా అధికారులపై ఫైర్ అయిన కలెక్టర్

దిశ దశ, జగిత్యాల:

సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అధికారులు డుమ్మా కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారా కలెక్టర్. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణికి అటెండ్ కాకుండా తమ శాఖకు చెందిన ఉద్యోగులను పంపిస్తున్న తీరును గమనించిన ఆమె సీరియస్ అయ్యారు. ఇక ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వ శాఖకు చెందిన ప్రతి అధికారి విధిగా ప్రజావాణికి హాజరు కావల్సిందేనని స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా బోసిపోయిన ప్రజావాణి కార్యక్రమాన్ని గమనించారు. కొంతమంది అధికారులు తమ శాఖకు చెందిన ఉద్యోగులను పంపించగా మరికొన్ని శాఖల అధికారులు డుమ్మా కొట్టారని గమనించిన కలెక్టర్ జిల్లా అధికారుల తీరుపై మండిపడ్డారు. జిల్లా అధికారులు కాకుండా ప్రయత్యామ్నాయంగా ఉద్యోగులను పంపించినట్టయితే వారి అటెండెన్స్ తీసుకోకూడదని ఏఓను అదేశించారు యాస్మిన్ బాషా. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికే రాకుంటే ఎలా అని ప్రశ్నించారు. అంతేకాకుండా విభాగాల వారిగా ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన వారి విభాగం ఏంటీ..? క్యాడర్ ఏంటీ అన్న వివరాలు తెలుసుకుని వెంటనే సంబంధిత శాఖకు చెందిన జిల్లా అధికారిని పిలిపించాలని ఆదేశించారు. 10.30 గంటలు అవుతున్నా అధికారులు రాకుండా మొక్కుబడి తంతులా వ్యవహరిస్తున్న తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని శాఖలకు చెందిన అధికారులు కలెక్టర్ కు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా తప్పుపట్టారు. ఇక నుండి ప్రజావాణికి హాజరు కాని అధికారులపై కఠినంగా వ్యవహరిస్తానని కలెక్టర్ యాస్మిన్ బాషా హెచ్చరించారు.
వీడియో కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి

You cannot copy content of this page