ఆ ఆచారన్ని పట్టించుకోని ఆఫీసర్స్….
ఎదుటి వారి సాంప్రాదాయాలను, సంస్కృతిని గౌరవించిన ఓ ఉన్నతాధికారిని చూసి ఆదర్శంగా వ్యవహరించాల్సింది పోయి.. మొక్కు బడిగా తామూ ఆ తంతులో భాగస్వాములమయ్యామన్న సంతృప్తిని ప్రదర్శించిన అధికారుల తీరు విస్మయం కల్గిస్తోంది. ఇందుకు దేవాదాయ శాఖ అధికారులు కూడా కిమ్మనకుండా, వేద పండితులూ తమ మంత్రోఛ్చారణలతో కార్యక్రమాన్ని కొనసాగించడం మరీ విడ్డూరంగా మారింది. నిభందనలు పక్కన పెడితే సాంప్రాదాయాలను గౌరవించాలన్నఅభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి అక్కడ.
సామాన్యుడికేనా…?
సామాన్యుడయితే ఉత్తరీయం పంచె ఉంటేనే ప్రత్యేక పూజలు అని చెప్పే దేవాదాయ శాఖ ఏకంగా బ్రహ్మోత్సవాల విషయంలోనే ఈ ఆచారాన్ని ఎందుకు పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా దేశంలోనే అద్భుత ఘట్టానికి జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ భాషా శ్రీకారం చుట్టి తనలోని మత సామరస్యతను చేతల్లో చూపించారు ఆమె వ్యవహరించిన తీరు యావత్ దేశానికే ఆదర్శంగా నిలివడంతో పాటు నెటిజన్ల ప్రశంసలు వెల్లివిరిస్తున్నాయి. అయితే ఆమెను గమనించిన తరువాత అయినా సాంప్రాదాయలకు విలువ ఇవ్వని ఇతర అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఏకంగా బ్రహ్మోత్సవాల్లోనే సాంప్రాదాయ దుస్తులకు మంగళం పాడడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిభందలన ప్రకారం పంచె, ఉత్తరీయం కానీ లాల్చీ పైజామా లేకుండా పట్టు వస్త్రాలు సమర్పించకూడదు. ఆలయ సాంప్రాదాయాలను పాటిస్తూ ఈ కార్యక్రమంలో కనిపిస్తున్న ఈఓ శ్రీనివాస్ పంచె, ఉత్తరీయంతో ఈ కార్యక్రమానికి హాజరైనప్పటికీ కొంతమంది అధికారులు ఏకంగా పాయింట్లు వేసుకుని పట్టు వస్త్రాలతో పాటు స్వామి వారికి సమర్పించే ఇతరాత్రాలను నెత్తిన పెట్టుకుని నర్సన్న సన్నిధికి చేరుకోవడం గమనార్హం. కలెక్టర్ యాస్మిన్ భాషా నెత్తిన తలపాగ చుట్టుకుని మరీ ఆదర్శంగా నిలిచారు. కానీ క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారులు హిందువులే అయినప్పటికీ సాంప్రాదాయానికి తిలోదాకలిచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
నిలువరించలేదెందుకు..?
ఐఏఎస్, ఐపీఎస్ సీనియర్ ఆఫీసర్లు సైతం ఆలయాల్లో ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యమిచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఇలాంటి కార్యక్రమాలకు హాజరైనప్పుడు సాంప్రాదాయలను గౌరవించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ధర్మపురి క్షేత్రంలో మాత్రం ఈ విధానాన్ని అమలు చేసేందుకు దేవాదాయ శాఖ అధికారులు ఎందుకు వెనుకంజ వేశారన్నదే అంతు చిక్కకుండా పోయింది. జిల్లా కలెక్టర్ కు సాంప్రాదాయాలు వివరించిన అర్చకులు, ఆలయ అధికారులు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న వారికి ఎందుకు చెప్పలేక పోయారు..? సంస్కృతికి భిన్నంగా వస్త్ర ధారణ ఉందని అభ్యంతరం ఎందుకు చెప్పలేదన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతోంది. అసలు వాస్తవాలను మరుగున పడేసేందుకు దేవాదాయ శాఖ అధికారులు అలాంటిదేమి లేదు, పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ గారు మాత్రమే సాంప్రాదాయాలు పాటిస్తే చాలు మిగతావారికి అవసరం లేదు అన్న ప్రకటన కూడా చేస్తారేమో. కానీ ఖచ్చితంగా నిభందనలకు విరుద్దమేనని గుర్తించి ఇక ముందైనా ఇలాంటి పద్దతులకు స్వస్తి పలికి ఆలయ మర్యదాలు పాటించేందుకు చొరవ చూపండి. ఎందుకంటే ఆలయంలో ఉండే వాయిద్య కారులు సైతం పంచె, ఉత్తరీయం ధరించడం, నాల్గో తరగతి ఉద్యోగులు కూడా ధవళ వస్త్రాలు ధరించడమన్న నిభందనలు దేవాదాయ శాఖ అమలు చేస్తున్న విషయం మర్చిపోకండి.