పండక్కి రండి… భూపాలపల్లి కలెక్టర్ ఆహ్వాన పత్రికలు…

దిశ దశ, భూపాలపల్లి:

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఈ పండగకు హాజరు కావాలంటూ ఓ జిల్లా కలెక్టర్ ముద్రించిన ఆహ్వాన పత్రికలు వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకకు హాజరై ఫలాలను అందుకోవాలని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతూ ముద్రించిన ఈ ఇన్విటేషన్ కార్డ్స్ సరికొత్త సాంప్రాదాయానికి తెరలేపాయి. జిల్లా కలెక్టర్ వేడుకకు రావాలంటూ ఆహ్వాన పత్రికలు పంపడానికి అసలు కారణం ఏంటంటే…? లోకసభ ఎన్నికల సందర్భంగా ఈ నెల 13న పోలింగులో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ విధిగా పాల్గొనాలని కోరుతూ ఆహ్వాన పత్రికలను తయారు చేయించారు. ఈ నెల 13న భారత ప్రజాస్వామ్య పండగ సందర్బంగా వేడుకలో పాల్గొని ఎంపీని ఎన్నుకోవాలని సూచించారు. పోలింగ్ స్టేషన్లు వేదికగా నిర్వహించే ఓటింగ్ ప్రక్రియకు హాజరయినట్టయితే శక్తి వంతమైన విందు ఫలాలు ఐధేళ్ల పాటు అందుకోవచ్చన్నారు. అయితే ఈ వేడుకకు హాజరయ్యే ఓటర్లు ఖచ్చితంగా తమ వెంట ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ఫోటో గుర్తింపు కార్డును తప్పని సరిగా వెంట తీసుక రావాలని కూడా కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భ్రవేశ్ మిశ్రా పేరిట తయారైన ఈ ఇన్విటేషన్ కార్డుతో ఓటర్లలో చైతన్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. పోలింగ్ శాతం పెంచడంతో పాటు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఎన్నికల ప్రక్రియలో ఓటు హక్కు ఉన్న వారి భాగస్వామ్యాన్ని పెంచాలని ఎన్నికల కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా కూడా ఎన్నికల అధికారులు వివిధ రకాలుగా ఓటింగ్ శాతాన్ని పెంపోందించేందుకు ప్రయత్నిస్తున్నారు. కళా ప్రదర్శనలు, డిజిటల్ మీడియా ద్వారా అవగాహన కల్పించడంతో పాటు వివిధ రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే భూపాలపల్లి జిల్లా ఎన్నికల అధికారి ప్రజా స్వామ్య పండగకు హాజరు కావాలంటూ ఆహ్వాన పత్రికలు తయారు చేయించి కొత్త పంథాను ఎంచుకున్నారు. చాలామంది వివాహంతో పాటు ఇతరాత్ర వేడుకలకు ఆత్మీయులను పిలుచుకునేందుకు ఆహ్వాన పత్రికలను ముద్రిస్తుంటారు. సర్వ సాధారణంగా వినియోగించే ఇన్విటేషన్ కార్డుల విధానాన్ని ఓటర్ల కోసం ఎందుకు ఉపయోగించుకోకూడదని భావించిన భూపాలపల్లి జిల్లా అధికారులు ఆహ్వన పత్రికలను తయారు చేసి ఓటర్లకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కామన్ అయిన ఈ పద్దతిని పోలింగ్ కోసం పాటించిన తీరు సరికొత్త చర్చకు దారి తీసింది. సింపుల్ గా తయారు చేసిన ఇన్విటేషన్ కార్డుల వెనక ఉన్నది స్వీట్ థింక్ ఇదా అని కామెంటు చేస్తున్నారు పలువురు.

You cannot copy content of this page