రెండో ట్రాక్ పునరుద్దణ పూర్తి…
మరి కొన్ని గంటల్లో మూడో ట్రాక్ సిద్దం…
దిశ దశ, పెద్దపల్లి:
న్యూ ఢిల్లీకి వెల్లే ప్రధాన మార్గంలో గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పడంతో రైల్వే అధికారులు యుద్ద ప్రాతిపదికన పునరుద్దరణ పనులు చేపట్టారు. మంగళవారం రాత్రి రాఘవాపూర్, కన్నాల గ్రామాల మధ్య జరిగిన ఈ ఘటనతో మూడు లేన్లు కూడా దెబ్బతిన్నాయి. గూడ్స్ రైల్లో తరలిస్తున్న ఐరన్ కాయిల్స్ కోచులు చెల్లాచెదరై పడిపోవడంతో మూడు ట్రాకులు కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వై జీఎం అశోక్ జైన్, డివిజనల్ మేనేజర్ భరత్ కుమార్ జైన్ లు పెద్దపల్లి జిల్లాకు చేరుకుని ట్రాక్ పునరుద్దరణ పనులు చేపట్టారు. ఇందు కోసం 1200 మందిని వినియోగించడంతో పాటు 3 జేసీబీలు, 10 హిటాచీలు, 200 మిషన్లు, 3 క్రేన్లు, 3 హైడ్రా మిషన్లు, మొత్తం 25 యంత్రాలతో ట్రాక్స్ ను బాగు చేయించేందుకు ఉపయోగించారు. బుధవారం రాత్రి సింగిల్ ట్రాక్ పునరుద్దరణకు నోచుకోవడంతో గూడ్స్ రైళ్లను ప్రయోగత్మాకంగా ఢిల్లీ వైపునకు పంపించి ట్రయల్స్ నిర్వహించారు. దీంతో ట్రాక్ బాగానే ఉందని నిర్ధారించకున్న అధికారులు గురువారం వేకువ జాము నుండి ఢిల్లీ వైపునకు వెల్లే కొన్ని ప్యాసింజర్ రైళ్లను కూడా పంపించారు. అయితే ఇప్పటి వరకు సింగిల్ ట్రాక్ మాత్రమే పూర్తి స్థాయిలో సిద్దం కావడంతో ఇరువైపులా రైళ్ల రాకపోకలను అనుమతించడం లేదు. గురువారం ఉదయం వరకు రెండో ట్రాక్ ను కూడా పునరుద్దరించినప్పటికీ దానిపై ట్రయల్స్ నిర్వహించాల్సి ఉందని, గూడ్స్ రైళ్లను పంపించిన తరువాత ట్రాక్ సామర్థ్యం బాగా ఉందని గుర్తించి ప్యాసింజర్ రైళ్లను అనుమతించే అవకాశాలు ఉన్నాయి. మూడో ట్రాక్ ఈ రోజు మద్యాహ్నం వరకూ పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. దానిని పరీక్షించిన తరువాత దక్షిణ, ఉత్తర భారత దేశానికి రైళ్ల రాకపోకలు యథావిధిగా సాగనున్నాయి.
కలిసొచ్చిన పారిశ్రామిక ప్రాంతం…
రాఘవాపూర్ వద్ద రైళ్ల గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పిన ఘటనలో రైల్వే విభాగమే కాకుండా రామగుండం సింగరేణి, ఎన్టీపీసీ సంస్థల సహకారం అందించాయి. ఎన్టీపీసీ, సింగరేణి సంస్థల నుండి మ్యాన్ పవర్ తో పాటు మిషనరీలను కూడా రైల్వే అధికారులు తెప్పించుకుని ట్రాక్ పునరుద్దరణ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఏక కాలంలో 12 మంది సహాయక చర్యల్లో పాల్గొనడం భారీ సంఖ్యలో మిషనరీని ఉపయోగించడంతో 24 గంటల్లోగానే ఒక ట్రాక్ ను పునరుద్దరించడంలో రైల్వే అదికారులు సక్సెస్ అయ్యారు. గూడ్స్ ట్రైన్ లో ఐరన్ కాయిల్స్ తరలిస్తుండడంతో పాటు పట్టాలు తప్పిన తరువాత కూడా కొంత దూరం ట్రైన్ ప్రయాణం చేయడం వల్ల్ రైల్ పట్టాలను ముక్క ముక్కలు అయ్యాయి. బోగీలు కూడా చెల్లాచెదరై పడిపోవడంతో వాటిలో ఉన్న ఐరన్ కాయిల్స్ వల్ల నష్టం తీవ్రంగా జరిగిందని తెలుస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో మొత్తం ట్రాక్ మొత్తం ధ్వంసం అయిపోవడంతో అక్కడ పూర్తి స్థాయిలో పునరుద్దరణ పనులు చేపట్టాల్సిన పరిస్థితి ఎదురు అయింది. అయితే రైల్వే అధికారులకు స్థానికంగా ఉన్న సింగరేణి, ఎన్టీపీసీ సంస్థల సేవలు కలిసి వచ్చాయి, లేనట్టయితే ట్రాక్ పునరుద్దరణ పనులు మరింత ఆలస్యం అయ్యేవని తెలుస్తోంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంతో దాదాపు 50 వరకూ రైళ్లను రద్దు చేయడంతో పాటు రీ షెడ్యూల్ చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. దేశంలోనే అత్యంత ముఖ్యమైన రైల్వే రూట్లలో పెద్దపల్లి బల్లార్షా రూట్ కూడా ఒకటి కావడం వల్లే ఈ స్థాయిలో ట్రైన్లను రద్దు చేసుకోవల్సి వచ్చింది. వెంటనే రైళ్ల రాకపోకలు కొనసాగించేందుకు ట్రాక్ పునరుద్దరణ కోసం సత్వర చర్యలు చేపట్టేందుకు రైల్వే అధికారులు రంగంలోకి దిగినా… అవసరమైన మిషనరీ, మ్యాన్ పవర్ అందుబాటులో ఉండే అవకాశం లేదు. కానీ రామగుండం పారిశ్రామిక ప్రాంతం సమీపంలోనే ఉండడం అనుకూలం అయింది.