మాజీ సీఎంకు నోటీసులు ఇచ్చిన జస్టిస్… జులై 30 వరకు గడువు కోరిన కేసీఆర్..

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు జస్టిస్ నరసింహరెడ్డి కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 15లోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో కోరింది. అయితే తాను జులై 30 వరకు వివరణ ఇస్తానని కేసీఆర్ కమిషన్ కు తెలిపారు. యాదాద్రి, భద్రాద్రి, దామరచర్ల విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన ఒప్పందాలపై, బీఆర్ఎస్ హయాంలో జరిగిన పీపీఏలలో చోటు చేసుకున్న అవకతకవలపై జస్టిస్ నరసింహరెడ్డి కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణకు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు అంశం కూడా ఈ విచారణలో ఉంది. రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి, కొనుగోళ్లకు సంబందించిన అంశాల్లో మొత్తం 25 మందికి కమిషన్ నోటీసులు ఇవ్వగా అందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరు. సోమవారం తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో మాజీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డి.ప్రభాకరరావు, మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్‌ చందా కమిషన్‌ ముందు హాజరయ్యారు. సురేశ్ చందా ఇంధన శాఖలో పనిచేసిన సమయంలో ఛత్తీస్‌గఢ్ నుండి విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ జరిగింది. నోటీసులు అందుకున్న వారు ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేనట్టయితే వ్యక్తిగతంగా హాజరు కావాలని కూడా ఆదేశించనున్నారు.

You cannot copy content of this page