వన్య ప్రాణుల కోసం వేట… మనుషుల ప్రాణాలతో ఆట…

అడవుల్లో కొనసాగుతున్న మరణ మృదంగం…

దిశ దశ, భూపాలపల్లి:

రాత్రి వేళల్లో విద్యుత్ తీగలను అమర్చి అడవి జంతువులను చంపేందుకు చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్నాయి. అన్నలను ఏరివేసేందుకు కూంబింగ్ అపరేషన్లు నిర్వహించే పోలీసుల ప్రాణాలకు సవాల్ విసురుతున్నారు వేటగాళ్లు. దీంతో అడవుల్లో తిరిగే మనుషుల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతోంది. అసలే సరిహద్దు ప్రాంతం… అపై అడవులు విస్తరించిన ఏరియా కావడంతో సెర్చింగ్ ఆపరేషన్ విషయంలో పోలీసు అధికారులు కఠినంగా వ్యవహరిస్తుంటారు. ఈ క్రమంలో అభం శుభం తెలియని ఓ గ్రౌహౌండ్స్ కానిస్టేబుల్ మరణించాడు. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డను సందర్శించాలని నిర్ణయించుకున్నారు. దీంతో పోలీసు అధికారులు సరిహద్దు అటవీ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతానికి అవతలి వైపున ఉన్న మహారాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్రాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు కొనసాగుతున్న నేపథ్యంలో వీఐపీల టూర్ కంప్లీట్ అయ్యే వరకూ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో భూపాలపల్లి జిల్లా సరిహద్దు అడవుల్లో బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. ఆదివారం అర్థరాత్రి సెర్చింగ్ ఆపరేషన్ లో పాల్గొన్న గ్రౌహౌండ్స్ కానిస్టేబుల్ ప్రవీణ్ వన్య ప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి మృత్యువాత పడడం విషాదాన్ని నింపింది. నక్సల్స్ కార్యకలాపాలను నిరోధించేందుకు అడవుల్లో సంచరించే గ్రౌ హౌండ్స్ బలగాల ప్రాణాలకు ఎలాంటి గ్యారెంటీ లేకుండా పోయిందని స్పష్టం అవుతోంది. స్థానికంగా ఉండే వేటగాళ్లు అటుగా వెల్లే ప్రాణులను హతమార్చేందుకు విద్యుత్ వైర్లను పొదల మాటున అమరుస్తారు. వాటిని గమనించని అడవి జంతువులు విద్యుత్ తీగలు తగలగానే చనిపోతుంటాయి. అయితే వీటిని అమర్చిన విషయం తెలియని వారు అటుగా వెల్లి ప్రాణాలు కోల్పోతున్నారు.

గతంలో కూడా…

కీకరాణ్యాలు విస్తరించుకుని ఉన్న తూర్పు అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల వేటగాళ్లు సామన్యుల జీవితాలతో చెలగాటమాడిన సందర్బాలు చాలానే ఉన్నాయి. ఇక్కడి అటవీ ప్రాంతంలో నిత్యకృత్యంగా సాగే ఈ తంతును నిలువరించేందుకు అటు నక్సల్స్ ఇటు పోలీసులు, అటవీ శాఖ అధికారులు చేయని ప్రయత్నాలు లేవనే చెప్పాలి. పీపుల్స్ వార్ నక్సల్స్ కూడా వన్య ప్రాణుల కోస ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లకు తగిలి మృత్యువాత పడిన సందర్బాలు కూడా లేకపోలేదు. దీంతో ఎప్పుడూ అడవుల్లో సంచరించే నక్సల్స్ కూడా వన్యప్రాణుల వేటగాళ్లకు హెచ్చరికులు చేయడంతో పాటు వారి కోసం అన్వేషణ కూడా కొనసాగించే వారు. పోలీసు, అటవీ శాఖ యంత్రాంగం కూడా వేటగాళ్ల కోసం స్పెషల్ ఆపరేషన్లు నిర్వహించే వారు. కానీ ఇటీవల కాలంలో విద్యుత్ తీగలను అమర్చే బ్యాచులను కట్టడి చేసే చర్యలు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. అడవులు కూడా గణనీయంగా తగ్గిపోవడం కూడా ఇందుకు కారణమని చెప్పవచ్చు. అడవుల ఖిల్లా ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ కు చెందిన కానిస్టేబుల్ విద్యుత్ షాక్ కు గురై చనిపోయిన ఘటన తరువాత అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్ఫష్టం అవుతోంది. ఇలాంటి వారిని గుర్తించి వన్యప్రాణి సంరక్షణ చట్టాలతో పాటు హత్య కేసులను కూడా నమోదు చేసినట్టయితే మరోకరు ఇలాంటి దుశ్యర్యలకు పాల్పడే అవకాశం ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page