దిశ దశ, కరీంనగర్:
వీఐపీలు, పోలీసు అధికారుల సెక్యూరిటీ ఆఫీసర్లుగా విధులు నిర్వర్తిస్తుంటారు వారంతా. ఆందోళనలు, రద్దీగా ఉండే సమయాల్లో బందోబస్తు డ్యూటీల్లో తలమునకలువుతుంటారు. సాధారణ పోలీసులతో పోల్చితే భిన్నమైన విధులతో డ్యూటీలు చేసే ఆర్మ్ డ్ రిజర్వూ విభాగానికి చెందిన కానిస్టేబుళ్లు తమ ఔదర్యాన్ని చాటుకుంటున్నారు. సమాజానికి తమవంతుగా సేవ చేయాలని తపన పడుతున్నారు. 1995 బ్యాచ్ కు చెందిన కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న ఏఆర్ పీసీలు అంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. గత నాలుగైదు ఏండ్లుగా తమతో పాటు పోలీస్ విభాగంలో సెలక్ట్ అయిన బ్యాచ్ మెంట్లు చనిపోతే వారి కుటుంబాలకు బాసటగా నిలవాలని భావించారు. 1995 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుళ్లు అకాల మరణం చెందితే వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇప్పటి వరకు తమ బ్యాచ్ మెంట్ కానిస్టేబుళ్ల కుటుంబాలకు అండగా నిలిచేందుకు చొరవ చూపిన వీరు ఈ సారి వినూత్న నిర్ణయం తీసుకున్నారు. పోలీసు విభాగంలో చేరి మూడు దశాబ్దాలు అవుతున్నందున సమాజ సేవ కూడా చేయాలని భావించారు. ఇందుకోసం కరీంనగర్ సమీపంలోని రేకుర్తి ప్రభుత్వ అంధుల పాఠశాలకు తమ వంతుగా చేయూత అందించాలని నిర్ణయించారు. అంధుల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఆవరణలో దుస్తులు ఆరేసుకునేందుకు ప్రత్యేకంగా షెడ్ ఉంటే బావుంటుందని తెలుసుకున్నారు. వర్షాకాలంలో వీరి డ్రెస్సులు ఆరు బయటే వేస్తుండడంతో తడిచిపోతున్నాయని దీంతో తడి దుస్తులను వేసుకోలేక అంధ విద్యార్థులు అవస్థలు పడుతున్నారని తెలియడంతో రూ. 50 వేలు వెచ్చించి ప్రత్యేకంగా షెడ్ నిర్మాణం చేయించారు. పాఠశాల హెచ్ఎం నర్మద, అధ్యాపక బృందం సమక్షంలో ఈ షెడ్డును శుక్రవారం వినియోగంలోకి తీసుకవచ్చారు. కేవలం తమ బ్యాచ్ కానిస్టేబుళ్ల కుటుంబాలకే తమ సేవలు పరిమితం కావడం కంటే సమాజంలోని ఇతర వర్గాలను కూడా ఆదుకునేందుకు సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించి తొలిసారి రేకుర్తి అంధుల పాఠశాల విద్యార్థుల కోసం తమ వంతు సహకారాన్ని అందించారు 1995 బ్యాచ్ ఏఆర్ కానిస్టుబుళ్లు.