విప్లవ కుటుంబాల మధ్య బ్యాలెట్ పోరు

దిశ దశ, వరంగల్:

విప్లవోద్యమాలకు పెట్టింది పేరైన ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ చైతన్యమూ ఎక్కువే. దున్నే వాడిదే భూమి, భూస్వామ్య విధానం అంతం కావాలి అని నినదించిన గొంతుకలు ఎన్నెన్నో. సాయుధ పోరువైపు సాగి సైద్దాంతికత నిర్మాణం కోసం అడవిలో మగ్గిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. బ్యాలెట్ కాదు బుల్లెట్ తోనే రాజ్యాధికారం సాధ్యమంటూ అటవీ గ్రామాల్లో చైతన్యం నింపిన అన్నల ఫ్యామిలీస్ ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి వచ్చాయి. అక్కడ బరిలో నిలిచిన వారిలో బుల్లెట్ వదిలి బ్యాలెట్ వైపు అడుగులు వేసిన వారు ఒకరైతే… ఎన్నికలను బహిష్కరించాలని పిలుపును ఇచ్చిన పార్టీ వారసురాలు మరోకరు. ఈ నియోజకవర్గ చరిత్రలో తొలిసారి ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఇద్దరూ మహిళలు కావడం ఒక ఎత్తైతే… ఇద్దరూ విప్లవ నేపథ్యం ఉన్న కుటుంబాలకు చెందిన వారే కావడం విశేషం.

ములుగు నియోజకవర్గం…

ఆదివాసీ పోరాట బిడ్డలు సమ్మక్క, సారలక్కలు వెలిసిన మేడారం, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన రామప్ప దేవాలయం, పర్యాటకులను అలరించే లక్నవరం, బొగతా జలపాతం ఇలా సహజ సౌందర్యానికి, ఆనాటి పోరాట పటిమకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది ములుగు జిల్లా. ఆదివాసిలు, బంజారా బిడ్డలు ఎక్కువగా ఉన్న ఈ జిల్లా చారిత్రాత్మక నేపథ్యం తనలో దాచుకుంది ఈ జిల్లా. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ములుగును నూతన జిల్లాల ఆవిర్భావం తరువాత కొంతకాలానికి రాష్ట్ర ప్రభుత్వం మరో జిల్లాగా గుర్తించింది. ములుగు నియోజకవర్గంలో గత చరిత్ర చూసుకున్నట్టయితే ముగ్గురు మాత్రమే వరసగా రెండు సార్లు అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. హ్యాట్రిక్ కొట్టిన నేతలు మాత్రం ఇక్కడ నుండి లేకపోవడం గమనార్హం. సిట్టింగ్ ఎమ్మెల్యే దనసరి సీతక్క రెండు సార్లు అసెంబ్లీలోకి అడుగుపెట్టినప్పటికీ ప్రతిపక్ష పార్టీ ప్రతినిధిగానే ఎన్నికయ్యారు. మధ్యలో ఓ సారి ఓటమి చవి చూసిన సీతక్క మూడో సారి ప్రజా క్షేత్రంలో తన భవిష్యత్తును పరీక్షించుకుంటున్నారు. తొలుత టీడీపీ తరుపున పోటీ చేసిన సీతక్క ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. గతంలో ఇక్కడి నుండి రెండు సార్లు గెల్చిన పొదెం వీరయ్యకు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భద్రాచలం సీటు కెటాయించగా ఆయన అక్కడ గెలిచారు. ఇప్పుడు కూడా అక్కడి నుండే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుండి అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా, జడ్పీ ఛైర్ పర్సన్ బడే నాగ జ్యోతి పోటీ చేస్తున్నారు.

నేపథ్యం ఒకటే…

ఈ సారి ములుగు ఎన్నికల చరిత్రలోనే అరుదైన రికార్డు నమోదు క్రియేట్ చేసినట్టయింది. ఇక్కడి నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క, బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగ జ్యోతిలు ఇద్దరు కూడా మహిళలు కావడం విశేషం. ఇద్దరు మహిళలు ప్రత్యర్థులుగా పోటీ పడడం కూడా ఇదే తొలిసారి కాగా ఇద్దరు కూడా ఆదివాసి తెగలకు చెందిన కోయ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. ఈ నియోజవర్గంలో కోయ సామాజిక వర్గానికి చెందిన ప్రజలే ఎక్కువగా ఉండడంతో ఈ గణాంకాలు పరిశీలించిన తరువాతే అధికార బీఆర్ఎస్ పార్టీ బడే నాగజ్యోతికి అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క జనశక్తి పార్టీలో అజ్ఞాతంలో పనిచేసి బయటకు వచ్చి బుల్లెట్ వదిలేసి బ్యాలెట్ బాట పట్టారు. ఆమె భర్త రామన్న ఎన్ కౌంటర్ లో హతం అయ్యారు. వివిధ విప్లవ గ్రూపులో పనిచేసిన నేపథ్యం సీతక్క దంపతులకు ఉంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీకి తొలిసారి పోటీ చేస్తున్న బడే నాగ జ్యోతి కుటుంబానికి విప్లవ నేపథ్యం ఉండడం గమనార్హం. ఆమె తండ్రి బడే ప్రభాకర్ అప్పటి పీపుల్స్ వార్ లో ముఖ్య నాయకునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న క్రమంలో ఎదురు కాల్పుల ఘటనలో చనిపోయారు. మావోయిస్టు పార్టీలో విలీనం అయిన తరువాత కూడా నాగ జ్యోతి బాబాయ్ బడే దామోదర్ అలియాస్ చొక్కరావు కూడా ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ఎన్నికలను బహిష్కరించాలని కూడా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బుల్లెట్ ద్వారానే రాజ్యాధికారం సాధ్యమని నినదించే మావోయిస్టు పార్టీలో బడే జ్యోతి బంధవులు పోరాటం చేస్తుండడం గమనార్హం. ఏది ఏమైనా ములుగు నియోజకవర్గంలో మాత్రం ఈ సారి ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలు పోటీ పడుతుండడం, అందునా వీరిద్దరు కూడా సాయుధ పోరుబాట నేపథ్యం కలిగి ఉండడం చర్చనీయాంశం అవుతోంది.

You cannot copy content of this page