మూడో టీఎంసీ నిర్మాణ కంపెనీపై రిటైర్డ్ పోలీసు ఆఫీసర్ ఫిర్యాదు
దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
మిడ్ మానేరు ప్రాజెక్టులో కాంట్రాక్టర్ ఇష్టారీతిన వ్యవహరించి కాలువ తవ్వకాలకు సంబంధించిన మట్టిని, రాళ్లను తరలించారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ పోలీసు అధికారి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దాసరి భూమయ్య ఫిర్యాదు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు చేసిన దాసరి భుమయ్య సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మూడో టీఎంసీ కోసం ప్రత్యేకంగా మిడ్ మానేరు ప్రాజెక్టు నుండి అనంతగిరి రిజర్వాయర్ వరకు నీటిని సరపరా చేసేందుకు కాలువ తవ్వకాలు జరిపారని పేర్కొన్నారు. అయితే మూడో టీఎంసీ పనుల కోసం చేపట్టిన నిర్మాణాల్లో భాగంగా తవ్వకాలు జరిపారని ఇందులో బయటపడ్డ భారీ సైజు రాళ్లు, మట్టిని భూసేకరణ జరిపిన ప్రాంతంలో కాకుండా మిడ్ మానేరు ప్రాజెక్టులో డంప్ చేశారని ధాసరి భూమయ్య ఆ ఫిర్యాదులో వివరించారు. నిబంధనల ప్రకారం సదరు కాంట్రాక్టర్ మిడ్ మానేరు బ్యాక్ వాటర్ ఏరియాలో వేస్టేజ్ డంప్ చేయకూడదన్నారు. మూడో టీఎంసీ పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థ ప్రతిమ కన్సట్రక్షన్స్ యాజమాన్యం మిడ్ మానేరు ప్రాజెక్టులో డంప్ చేశారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దాసరి భూమయ్య ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
ఎంపీ సంతోష్ కుమార్ కుటుంబంపై…
మరో వైపున బీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావు అతని కుటుంబ సభ్యులపై కూడా దాసరి భూమయ్య బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణం కోసం భూ సేకరణ జరిగిందని ఇందులో బాధితత రైతులకు పరిహారం చెల్లించాలని, అర్హులైన పేదలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ద్వారా కూడా ఆర్థిక సాయం అందించాల్సి ఉంటుందని వివరించారు. అయితే బోయినపల్లి మండలంలోని కొదురుపాక గ్రామానికి చెందిన జోగినపల్లి సంతోష్ కుమార్ తండ్రి జోగినపల్లి రవిందర్ రావుకు బీపీఎల్ కోటాలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఆర్థిక సాయం చేశారన్నారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే అర్హులు కాకున్నప్పటికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద పరిహారం ఇచ్చారని దాసరి భూమయ్య ఆరోపించారు. అలాగే దాదాపు 25 ఏళ్ల క్రితమే సంతోష్ కుమార్ చెల్లెలు సౌమ్యకు వివాహం జరగగా ఆమె హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారని తెలిపారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ద్వారా సౌమ్యకు పరిహారం ఇవ్వడానికి నిబంధనలు అనుకూలించనప్పటికీ లబ్ది చేకూర్చారని, ఆయన చిన్నాన్న గండ్ర రమణారావు సిరిసిల్ల మండలం పెద్దూరు నివాసి అయినప్పటికీ బోయినపల్లి మండలం కొదురుపాకతో ఏమాత్రం సంబంధం లేకున్నా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ద్వారా పరిహారం ఇప్పించారని దాసరి భూమయ్య ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆదేశాల మేరకే అధికారులు అనర్హులైనా లబ్ది చేకూర్చారన్నారు. అర్హత లేకున్నా ఎంపీ సంతోష్ కుమార్ తన కుటుంబ సభ్యులకు లబ్ది చేకూర్చేందుకు కుట్రపన్నారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బోయినపల్లి ఎస్సైకి ఇచ్చిన పిటిషన్ లో కోరారు. అర్హులైన నిర్వాసితులకు నేటికి పరిహారం రాలేదు కానీ అనర్హులకు మాత్రం అందించారని దాసరి భూమయ్య ఆ ఫిర్యాదులో వెల్లడించారు.