దిశ దశ, కరీంనగర్:
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిజాబామాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ పై స్వతంత్ర అభ్యర్థి కరీంనగర్ ఎన్నికల అధికారి పమేలా సత్పతికి ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్ పై చర్య తీసుకోవాలని కోరారు. ఈ వివరాలను స్వతంత్ర అభ్యర్థి దేవతి శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. తాను ఈ నెల 6న కరీంనగర్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశానని, ఇందులో తన ఓటరు నమోదుకు సంబంధించిన కాపీ కానీ, సర్టిఫైడ్ కాపీ కానీ సమర్పించలేదుని కరీంనగర్ ఎన్నికల అధికారి కార్యాలయం తనకు మెమో జారీ చేసిందన్నారు. ఎన్నికల అధికారులు అడిగిన వివరాలు ఇవ్వాలని కోరేందుకు తాను నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ అంకిత్ ను కలిసినప్పుడు అవమానపర్చారని దేవతి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ మేరకు తాను ఎమ్మెల్సీ ఎన్నికల అధికారి పమేలా సత్పతికి ఫిర్యాదు చేశానని, దళితుడినైన తనను అవమానపర్చే విధంగా వ్యవహరించిన సదరు అధికారిపై చర్య తీసుకోవాలని కోరానని ఆయన తెలిపారు.
దాడి చేశారు…
ఎన్నికల అధికారికి తాను వివరాలు అందించేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకోగా తన కారుపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారని దేవతి శ్రీనివాస్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి అనుచరులు తను కారును డ్యామేజ్ చేశారని, కారు అద్దాలు పగిలినట్టయితే తమపై కూడా దాడి చేసే వారని శ్రీనివాస్ ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ఈ విషయంపై విచారణ చేయాలని అభ్యర్థించారు.