రేవంత్‌ రెడ్డిపై పీడీ యాక్ట్ పెట్టాలని బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

ప్రగతి భవన్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు.. ములుగు బీఆర్ఎస్ నేతలు ఆయనపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తే యాత్రను అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. మంగళవారం ములుగులో పాదయాత్రలో భాగంగా ప్రగతిభవన్‌ను గ్రానైట్స్‌తో పేల్చేయాలంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా.. ఇవాళ నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున నిరసనలు, దిష్టిబొమ్మ దహనాలు, శవయాత్రలకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఒక పార్లమెంట్​ సభ్యుడుగా ఉండి పరిపాలనా భవనం, తెలంగాణ ప్రగతికి చిహ్నమైన ‘ప్రగతిభవన్’ను గ్రానైట్స్‌తో పేల్చేయమనడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఈ వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

నాడు నక్సలిజాన్ని నిషేధించింది కాంగ్రెస్ పార్టీ.. అదే కాంగ్రెస్ పార్టీ నేడు నక్సలైట్లతో ప్రగతిభవన్‌ను గ్రానైట్స్‌తో పేల్చేయండి అనడాన్ని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమర్ధిస్తారా అని పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డిపై పీడీ యాక్ట్ కింద కేసు పెట్టి జైలుకు పంపాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఇది పునరావృతమైతే పాదయాత్రను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

ములుగు జిల్లాలో రేవంత్ రెడ్డి నిర్వహించిన ‘హాథ్‌ సే హాథ్‌ జోడో’ యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. పాదయాత్రలో రైతులు, కూలీలతో మాట్లాడి వారి కష్ట సుఖాలు అడిగి తెలుకున్నారు. అండగా ఉంటానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ములుగు పంచాయతీ కార్యాలయం దగ్గర నిర్వహించిన సభలో మంగళవారం రోజున పాల్గొన్న రేవంత్‌రెడ్డి కేసీఆర్ పాలనపై మండిపడ్డారు. ఇష్టారీతిన అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు.

You cannot copy content of this page