ఆ ఎమ్మెల్యేకు సన్ స్ట్రోక్..!

టికెట్ ఇవ్వొద్దంటూ వినతి

దిశ దశ, వరంగల్:

బీఆర్ఎస్ పార్టీలో మరో జిల్లా అధ్యక్షునిపై వార్ స్టార్ట్ అయింది. ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వద్దంటూ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. దీంతో వరంగల్ జిల్లాలో ఆ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటన్న చర్చ మొదలైంది.

ఆపరేషన్ ‘ఆరూరి’…

వర్దన్నపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేష్ కు వ్యతిరేకంగా సొంత నియోజకవర్గంలోని నాయకులంతా జట్టుకట్టారు. ఉద్యమకారనులు, పార్టీ సీనియర్ నాయకులు అంతా కలిసి ఇప్పటికే అధిష్టానం పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఆయనకు టికెట్ ఇవ్వకూడదని, ఇచ్చినట్టయితే తాము మద్దతు ఇచ్చేది లేదని తెగేసి చెప్పినట్టుగా సమాచారం. దీంతో వర్దన్నపేట బీఆర్ఎస్ పార్టీలో సరికొత్త ముసలం మొదలైంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో అసమ్మతి రచ్చకెక్కుతుండడం అధిష్టానానికి ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి. ఎమ్మెల్యే వ్యవహార శైలిపై కత్తిగట్టిన వైరి వర్గం పావులు కదపడం మొదలు పెట్టడంతో అధిష్టానం ఎలాంటి ఎత్తులతో ముందుకు సాగనుందన్నదే హాట్ టాపిక్ గా మారింది. అరూరి తీరుపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమర్ లకు వర్దన్నపేటకు చెందిన కొంతమంది నాయకులు ఓరల్ కంప్లైంట్ కూడా ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది.

సన్ స్ట్రోకేనా..?

అయితే వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తన వారసున్ని రాజకీయాల్లోకి దింపాలన్న వ్యూహంతో పావులు కదుపుతున్నారు. కొంతకాలంగా ఆయన తనయుడు వర్దన్నపేటలో యాక్టివ్ పాలిటిక్స్ నెరుపుతున్నారు. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్న రమేష్ కొడుకు ప్రజా క్షేత్రంలో తన పట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పౌండేషన్ పేరిటనే పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుండడంతో వర్దన్నపేట సెకండ్ క్యాడర్ లీడర్లు గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియా ఇంఛార్జి బాధ్యతలు కూడా ఆయనకే ఇవ్వడం, ఇటీవల మంత్రి కేటీఆర్ టూర్ లో ప్రత్యేకంగా కార్యాలయాన్ని కూడా ప్రారంభించడం కూడా అసమ్మతి ఆజ్యానికి మరో కారణమని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడే తన కొడుక్కి బెర్త్ ఖాయం చేసినట్టయితే భవిష్యత్తులో ఇబ్బంది ఉండదన్న వ్యూహంతోనే విశాల్ ను రంగంలోకి దింపినట్టు ఉందని అసమ్మతి వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇందుకు తోడు రమేష్ వ్యవహరిస్తున్న శైలి కూడా సరిగా లేదన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వారూ లేకపోలేదు. అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ ఆయన మాట్లాడే తీరుపై పార్టీలో బహిరంగంగానే చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల పట్ల, పార్టీ క్యాడర్ పట్ల ఆయన మాట్లాడుతున్న తీరు తమను బాధిస్తోందని కొంతమంది నాయకులు ఆవేదన వెల్లగక్కుతున్నారు. గతంలో ఆరూరి రమేష్ మాట్లాడిన ఆడియో క్లిప్స్ కూడా వైరల్ అయ్యాయంటే ఆయన వాడే పదజాలంతో ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవచ్చని పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉద్యమ ప్రస్థానం నుండి కూడా అధినేత వెన్నంటి నడిచిన నేతలను కూడా విస్మరిస్తూ చులుకన చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. పార్టీ కోసమే పని చేస్తున్న నాయకులకు ఆర్థికంగా చేదోడుగా నిలిచేందుకు కాంట్రాక్టు పనులు కాని ఇతరాత్ర సపోర్ట్ కానీ చేయడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఆర్థికంగా చితికిపోయిన నాయకుల పరిస్థితి దయనీయంగా మారినా పట్టించుకునే వారే లేకుండా పోయారన్న ఆవేదన కూడా వ్యక్తమవుతోంది. నియోజకవర్గంలో అధికార యంత్రాంగాన్ని కూడా ఆయన చెప్పుచేతల్లోనే పెట్టుకోవడంతో తాము కార్యాలయాల వైపు కన్నెత్తి చూసే పరిస్థితి కూడా లేకుండా పోయిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నారు వర్దన్నపేట లీడర్లు.

రాజీకొచ్చేనా..?

అయితే స్థానిక నాయకులంతా కూడా ఆరూరికి వ్యతిరేకంగా అధిష్టానం ముందు చెప్పడంతో వీరందరిని రాజీ చేయడం అంత సులువు కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరూరిని మార్చుతారా లేక ఆయన వ్యవహారశైలిని మార్చే విధంగా అధిష్టానం చొరవ తీసుకుంటుందా అన్న డిస్కషన్ పార్టీ వర్గాల్లో మొదలైంది. రమేష్ స్థానంలో మరోకరికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అన్న అంశాంపై అధిష్టానం ఆరా తీసే అవకాశాలున్నాయని అసమ్మతి నేతలు బలంగా నమ్ముతున్నారు. అయితే ముఖ్య నాయకులు చొరవ తీసుకుని తనకు అనుకూలంగా అసమ్మతి వర్గాన్ని చల్లబరుస్తారన్న నమ్మకం ఆరూరిని వెంటాడుతోంది. ఈ క్రమంలో పార్టీ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందోనన్నదే మిస్టరీగా మారింది. ఏది ఏమైనా పార్టీ జిల్లా అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న ఆరూరి ఇతర నియోజకవర్గాల్లో వర్గపోరుకు బ్రేకులు వేయాల్సింది పోయి ఆయనే అసమ్మతిని ఎదుర్కుంటుండడం మాత్రం అధిష్టానానికి తలనొప్పిని తెచ్చి పెట్టిందన్నది వాస్తవం.

You cannot copy content of this page