దిశ దశ. భూపాలపల్లి:
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రి సూపరింటిండెంట్ తో పాటు యంత్రాంగంపై ఫిర్యాదు చేశారు బాధితులు. అనారోగ్యానికి గురైన పెషేంట్ కు సరైన పరీక్షలు నిర్వహించకుండా నామమాత్రంగా చికిత్స చేసి అంతా బావుందని చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ఈ మేరకు భూపాలపల్లికి చెందిన పిప్పాల రాజేందర్ డైరక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ (డీఎంఈ)కి ఫిర్యాదు చేశారు. స్థానిక వంద పడకల ఆసుపత్రి సూపరింటిండెంట్ తో పాటు సిబ్బంది తన అక్క పట్ల వివక్ష చూపారని ఆరోపించారు. కొంపల్లికి చెందిన తన సోదరి సాగి స్వరూప తీవ్ర గాయాల పాలు కాగా భూపాలపల్లి ఆసుపత్రికి ఈ నెల 10న తీసుకెళ్లామని, తనకు శ్వాస ఆడడం లేదని బెడ్ పై పడుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందని వైద్యులకు సూచించినప్పటికీ వారు పట్టించుకోలేదన్నారు. ఈ విషయం గురించి సూపరింటిండెంట్ నవీన్ కుమార్ కు ఫోన్ చేసి తాను పలుమార్లు అడిగగా స్వరూప నార్మల్ గానే ఉందని, ఛాతిలో నొప్పి మాత్రమేనని ఇబ్బంది ఏమీ లేదని చెప్పారని రాజేందర్ ఆ ఫిర్యాదులో వివరించారు. ఈ నెల 14న డిశ్చార్జి చేయడంతో స్వరూపను ఇంటికి తీసుకెళ్లగా అస్వస్థతో ఉన్న ఆమె తీవ్రంగా అవస్థ పడుతుండడం చూసి వెంటనే హన్మకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించామని రాజేందర్ తెలిపారు. అక్కడి వైద్యులు స్వరూపకు పరీక్షలు నిర్వహించగా పక్కటెముకలు విరిగి పోవడంతో బ్లీడింగ్ అయిందని, దీంతో ఇన్ ఫెక్షన్ కూడా అవుతోందని చెప్పారన్నారు. స్వరూప పరిస్థితి విషమంగా ఉందన్న విషయం హన్మకొండ ప్రైవేటు ఆసుపత్రికి వెల్లేవరకూ తమకు తెలియదని, ముందుగా చేర్చిన భూపాలపల్లి వంద పడకల ఆసుపత్రి యంత్రాంగం మాత్రం ఆమెకు ఏమీ కాలేదని బుకాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటిండెంట్ నవీన్ కుమార్, ఇతర వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన సోదరి పరిస్థితి విషమంగా మారిందని రాజేందర్ ఆరోపించారు. మరో వైపున సూపరింటిండెంట్ నవీన్ కుమార్ భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లను పరకాలలోని తన బంధువుల ఆసుపత్రికి పరోక్షంగా రెఫర్ చేయిస్తున్నారని కూడా ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, ఇతర యంత్రాంగం ద్వారా పరకాలలోని డాక్టర్ నవీన్ కుమార్ బంధువుల ఆసుపత్రికి వెళ్లాలంటూ అటెండెంట్స్ తో చెప్తున్నారన్నారు. భూపాలపల్లి ఆసుపత్రిపై వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజేందర్ ఆ ఫిర్యాదులో కోరారు.