50 గ్రామాలకు రవాణా సౌకర్యం…
దిశ దశ, రామడుగు:
చినుకు పడితే చాలు ఆ మండల కేంద్రానికి రహదారి సౌకర్యం బంద్ అయ్యేది. శిథిలమైన వంతెన మీదుగా ప్రయాణం చేయాలంటేనే జంకేవారు స్థానికులు. 50 గ్రామాలు, నాలుగు మండలాలను అనుసంధానం చేసే ఈ వారధి విషయంలో నిర్లక్ష్యం రాజ్యమేలింది. దీంతో వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ వంతెన నిర్మాణం చేయించండంటూ విన్నపాల వరద పారేది. అయినా ఆచరణలో పెట్టేందుకు చొరవ చూపే వారు లేక నేటికీ అక్కడి ప్రజల సహనాన్ని పరిక్షించినట్టయింది. కరీంనగర్ జిల్లా కేంద్రానికి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న రామడుగు మండల వాసుల కష్టాలకు పుల్ స్టాప్ పడినట్టయింది. రామడుగు మండలంలోని లోలెవల్ వంతెన మీదుగా దశాబ్దాలుగడా స్థానికులు రాకపోకలు సాగించే వారు. రామడుగు, గంగాధర, పెగడపల్లి, గొల్లపల్లి మండలాలకు చెందిన 50 గ్రామాల ప్రజలకు ఈ వారధే పెద్ద దిక్కుగా ఉండేది. అయితే ఇటీవల కాలంలో శిథిలమైపోయిన ఈ వారధి మీదుగా వర్షాకాలంలో రాకపోకలు సాగించే పరిస్థితి లేకుండా పోయింది. ఎగువ ప్రాంతం నుండి వచ్చే వరద నీటిలో కొట్టుకపోయే ప్రమాదం ఉంటుందని రాకపోకలను నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. 2019లో రూ. 8 కోట్లు మంజూరు చేసినప్పటికీ హై లెవల్ వంతెన నిర్మాణానికి అవాంతరాలు ఏర్పడ్డాయి. ఈ బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు ముందుకు వచ్చిన కాంట్రాక్టర్లు ఏకంగా నలుగురు మారారు. 90 శాతం పూర్తయిన ఈ వంతెన నిర్మాణం వల్ల తాము నష్టపోతున్నామని రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు సంబంధించిన వ్యవసాయ భూమి 1.30 ఎకరాలు కోల్పోతున్నామని తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే రైతులను మెప్పించి ఒప్పించేందుకు ముందుకు రాకపోవడంతో తుది దశకు చేరుకున్న ఈ వంతెన నిర్మాణం అర్థాంతరంగా నిలిచిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రైతులకు పరిహారం ఇప్పించే విషయంపై చొరవ తీసుకుని అధికారులతో చర్చించారు. వ్యవసాయ భూమిని కోల్పోతున్న ఇద్దరు రైతులను జిల్లా యంత్రాంగం వద్దకు తీసుకెళ్లి వారికి అవసరమైన పరిహారం ఇప్పించేందుకు సిద్దంగా ఉన్నామని హామీ ఇప్పించారు. అధికారులు మాట ఇవ్వడంతో బ్రిడ్జి నిర్మాణానికి రైతులు సమ్మతించడంతో ఎట్టకేలకు వంతెన పూర్తయింది. గురువారం రామడుగు వంతెనను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించడంతో వాహనాల రాకపోకలకు మోక్షం కలిగింది.