కామ్రేడ్స్ వర్సెస్ కాంగ్రెస్… నామ మాత్రంగా మారిన టీబీజీకేఎస్…

దిశ దశ, రామగుండం:

ద్యమ పార్టీకి అనుభందంగా ఉన్న కార్మిక సంఘం నామ మాత్రపు పోటీకే పరిమితం అయినట్టుగా కనిపిస్తోంది. వరసగా రెండు సార్లు విజయాలు అందుకున్న సంఘం నేడు పోటీలో ఉందా అంటే ఉంది అన్నట్టుగా ప్రభావాన్ని చూపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో బలమైన నిర్ణయాన్ని వెలువరించే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈ సారి అంటీముట్టనట్టుగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మిగిలిపోగా… ఏఐటీయూసీ, ఐఎన్ టీయూసీల మధ్యే పోరు సాగుతోంది. సోమవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి బ్రేకులు పడగా 27న పోలింగ్ జరగనుంది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ప్రాంతాల్లోని కార్మికులు తమ అభిప్రాయాన్ని వెలువరించనున్నారు. ఏడోసారి జరుగుతున్న ఈ ఎన్నికల్లో నల్ల సూర్యులు ఏ కార్మిక సంఘంలో వెలుతురులు నింపుతారోనన్నది తేలాల్సి ఉంది.

ఈ ఎన్నికల్లో…

స్వరాష్ట్ర కల సాకారం కోసం ఉద్యమం సాగుతున్న సమయంలో ఆవిర్బవించిన టీబీజీకేఎస్ తొలిసారి ఎన్నికల్లో నామమాత్రపు పోటీ ఇచ్చింది. సింగరేణి కార్మికులను తమకు అనుకూలంగా మల్చుకోలేకపోయింది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో మాత్రం ప్రత్యర్థులను మట్టి కరిపించి చరిత్రను తిరగరాసింది. వరసగా రెండు సార్లు సింగరేణి బొగ్గు గనుల్లో గులాభి జెండా రెపరెపలాడింది. అయితే ఈ సారి ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు డిసైడ్ చేయడంతో ముఖ్య నాయకులు వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి, కెంగెర్ల మల్లయ్యలు టీబీజీకేఎస్ కు రాజీనామా చేశారు. అయితే ఎన్నికల ప్రచారం చివరి రోజున మాత్రం యువ నాయకత్వాన్ని రంగంలోకి దింపాలన్న ప్రతిపాదనలు తీసుకొచ్చినందునే ముఖ్య నాయకులు దూరంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నికల బరిలో నిలవాల్సిన అవసరం లేదని… ఈ ఎన్నికలకు దూరంగా ఉండాల్సిందేనని అధిష్టానం నుండి సంకేతాలు వచ్చాయని టీబీజీకెఎస్ నాయకులు వెల్లడించారు. ఈ విషయంలో గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో కూడా చర్చలు జరిపిన అనంతరమే రాజీనామా చేశారు. కానీ ఇప్పుడు మాత్రం యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న కారణంగానే వారు పార్టీని వీడిపోయారన్న వాదనలు తెరపైకి తీసుకరావడం చర్చనీయాంశంగా మారింది. ఒక వేళ యువ నాయకత్వాన్ని బరిలో నిలపాలన్న ప్రతిపాదన ఉన్నట్టయితే ముఖ్య నాయకులు పార్టీని వీడిన తరువాత ఎందుకు పోటీలో నిలిపి వారిని గెలిపించేందుకు అవసరమైన ప్రచారం చేయడంలో బీఆర్ఎస్ అగ్రనేతలు ఎందుకు ముందుకు రాలేదన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. స్థానికంగా ఉన్న పార్టీ ఇంఛార్జీలు మాత్రమే టీబీజేకేఎస్ కు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు.

ఆ రెండింటి మధ్యే పోటీ…

అయితే టీబీజీకేఎస్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఒక్క సారిగా వెనకడుగు వేయడంతో ఈ ఎన్నికలు మాత్రం ఏఐటీయూసీ, ఐఎన్ టీయూసీ మధ్యే పోరు సాగుతున్నట్టుగా స్ఫష్టం అవుతోంది. 1998లో ప్రారంభం అయిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో 1998, 2001 ఎన్నికల్లో ఏఐటీయూసీ, 2003, 2007లో ఐఎన్ టీయూసీలు గెలిచాయి. అయితే 2012లో ఏఐటీయూసీ, ఐఎన్ టీయూసీలు పొత్తు పెట్టుకుని బరిలో నిలిచినప్పటికీ టీబీజీకేఎస్ 23 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించి సింగరేణి కార్మికుల్లో పట్టు సాధించింది. 2017 ఎన్నికల్లో కూడా టీబీజీకేఎస్ గెల్చినప్పటికీ… తాజా ఎన్నికల్లో మాత్రం అంతగా ఉనికిని చాటుకోవడం లేదని స్పష్టం అవుతోంది.

You cannot copy content of this page