యూట్యూబ్ చూస్తూ కాన్పు చేసుకుని..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. దాని వల్ల కలిగే ఉపయోగాల కంటే అనర్థాలే ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రేమ పేరుతో మోసాలు, హనీ ట్రాప్‌లు వంటివి చాలానే జరుగుతున్నాయి. తాజాగా ఓ 15ఏళ్ల బాలిక యూట్యూబ్‌లో చూసి తనకు తానుగా కాన్పు చేసుకుంది. ఆ తర్వాత పుట్టిన బిడ్డను గొంతు నులిమి చంపేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్‌లో చోటు చేసుకుంది.

అంబజారీ ప్రాంతానికి చెందిన ఓ 15ఏళ్ల బాలికకు సోషల్ మీడియాలో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. దీంతో బాలిక గర్భం దాల్చింది. బాలిక పొట్ట పెరుగుతుండటాన్ని గమనించిన తల్లి ఏంటని ప్రశ్నించగా.. అది అనారోగ్యం వల్ల పెరుగుతోందని తల్లిని బురిడీ కొట్టించింది. ఆ తర్వాత యూట్యూబ్‌లో కాన్పుకు సంబంధించిన వీడియోలను సెర్చ్ చేసి.. ఒంటరిగా కాన్పు ఎలా చేసుకోవచ్చో తెలుసుకుంది.

ఈ నెల 2న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆడబిడ్డకు బాలిక జన్మనిచ్చింది. ఆ వెంటనే ఆ శిశువును గొంతు నులిమి చంపేసింది. ఇంట్లోనే ఉన్న ఓ పెట్టెలో శిశువు మృతదేహాన్ని దాచిపెట్టింది. తిరిగి ఇంటికెళ్లిన తల్లికి కుమార్తె నీరసంగా కనిపించడంతో.. కాస్త గట్టిగా అడగ్గా అసలు విషయం చెప్పింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ ప్రాంతానికి వెళ్లి శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

You cannot copy content of this page