కష్టపడి పనిచేసినా ఫలితం లేదా..?
దిశ దశ, కరీంనగర్:
దశాబ్దాలుగా పార్టీతోనే మమేకమై ఉన్నా గుర్తించరా..? అధికారంలో లేకపోయినా జెండాను మాత్రం వీడ లేదు… అయినా మమ్మల్ని ఎందుకు విస్మరిస్తున్నారు..? నామినేటెడ్ పదవుల విషయంలో అయినా న్యాయం చేయాలి కదా అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. చెప్పా పెట్టకుండా తమకు అనుకూలమైన వారికి పదవులు కట్టబెట్టారు కానీ తమను మాత్రం పట్టించుకోలేదన్న ఆందోళన బాహటంగానే వ్యవక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసే ప్రక్రియలో పారదర్శకతను పాటించలేదంటూ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. అన్యాయం జరిగిదంటూ పలువురు నాయకులు ఆయా జిల్లాల మంత్రులను, ముఖ్య నాయకులను కలిసి ఆవేదన వెల్లగక్కుతున్నారు.
కరీంనగర్ ఇలా…
రాష్ట్రంలో మహిళా కమిషన్ ఏర్పాటు కోసం హై కోర్టుకు లేఖ రాశారు రేగులపాటి రమ్యారావు. మహిళా కమిషన్ విషయంలో సీరియస్ గా పోరాటం చేయడమే కాకుండా పార్టీతో అనుభందం పెనవేసుకుని వివిధ ప్రాంతాల్లో అభ్యర్థుల గెలుపులో తనవంతు భాగస్వామ్యం కూడా ఉంచానని అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కూతురు కూడా అయిన రమ్యారావు అక్కడి పరిస్థితులను విభేధించి మరీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న పరిణామాలతో పాటు ప్రగతి భవన్, ఎర్రవెల్లి ఫాంహౌజ్ లలో అసలేం జరుగుతోంది..? అక్కడ పెత్తనం చెలాయిస్తున్నదెవరూ అన్న విషయాలను వెలుగులోకి తీసుకరావడంలో ఏ మాత్రం వెనకాడలేదు. శకుని పాత్ర కారణంగానే కొన్ని సందర్బాల్లో కేసీఆర్ బిడ్డలకు అపాయింట్ మెంట్ కూడా దొరకని పరిస్థితులు తయారయ్యాయంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు రమ్యారావు. అయితే కాంగ్రెస్ పార్టీలో కూడా రాష్ట్ర స్థాయి బాధ్యతల్లో పనిచేసిన ఆమె కరీంనగర్ నుండి పోటీ చేయాలని ఆశించినప్పటికీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థి విషయంలో కూడా వ్యతిరేకత ప్రదర్శించలేదు. అయితే నామినేటెడ్ పదవి విషయంలో అయినా రమ్యారావుకు అవకాశం కల్పిస్తే బావుండేదన్న అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. మహిళా కమిషన్ ఏర్పాటు కోసం శ్రమించడంతో పాటు ఆమె పార్టీ లైన్ తప్పకుండా ముందుకు సాగారని ఆమెకు నామినేటెడెడ్ పదవిని కట్టబెడ్తే బావుండేందని అంటున్నాయి పార్టీ వర్గాలు. నామినేటెడెట్ పదవుల విషయంలో తనకు అన్యాయం జరిగిందని, అసలు సిసలు నాయకులను గుర్తించలేదంటూ రమ్యారావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఇంఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లతో పాటు పార్టీ ఇంఛార్జీ దీప్ దాష్ మున్షిలను కలిసి పదవుల పందేరంలో జరిగిన అన్యాయం గురించి వివరించారు.
రెంటికి చెడ్డ రేవడి…
ఇకపోతే 1991లో విద్యార్థి రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీతో అనుభందం పెట్టుకున్న వైద్యుల అంజన్ కుమార్ కు కూడా పార్టీ అన్యాయం చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 30 ఏళ్లకు పైగా పార్టీలోనే కొనసాగుతున్న అంజన్ కుమార్ వివిధ బాధ్యతల్లో పనిచేశారు. ఎన్ఎస్ యూఐలో ఉన్నప్పుడు పొన్నం ప్రభాకర్ అడుగుజాడల్లో నడిచిన ఆయన ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు శ్రీధర్ బాబుకు అనుకూలంగా, తిరిగి పొన్నం ప్రభాకర్ అనుచరుడిగా కొనసాగుతున్నప్పటికీ తనకు కనీసం నామినేటెడ్ పదవుల్లో కూడా అవకాశం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీ బిడ్డనైన తనకు న్యాయం చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసిన అంజన్ కుమార్, ఏఐసీసీ, పీసీసీ పెద్దలను కూడా కలుస్తున్నారు. తనకు జరిగిన అన్యాయం గురించి పార్టీ పెద్దలకు వివరిస్తూ నామినేటెడ్ పదవులను కట్టబెట్టాలని అభ్యర్థిస్తున్నారు. వీరితో పాటు మైనార్టీ నాయకులు కూడా తమకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినప్పటికీ తమకు సరైన గుర్తింపు ఇవ్వలేదంటూ వారు మదనపడుతున్నారు.