ఎనమాముల మార్కెట్ రేట్లు అమలు చేయాలని డిమాండ్
రాజీవ్ రహదారిపై స్తంభించిన రవాణా
దిశ దశ, పెద్దపల్లి:
తెల్ల బంగారం పండించే రైతుల కళ్లు ఎరుపెక్కాయి. ఆగ్రహంతో ఊగిపోతున్న రైతులు మార్కెట్ అధికారుల పనితీరుపై మండి పడుతున్నారు. పత్తి ధర విషయంలో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జాతీయ రహదారిపై పత్తి రైతులు బైఠాయించడంతో రెండు గంటలుగా రాజీవ్ రహదారిపై రాకపోకలు స్తంభించిపోయాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో తాము తీసుకొచ్చిన పత్తి విషయంలో అధికారులు సెలక్ట్ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని, సెలక్ట్ అయిన పత్తికి గిట్టు బాటు ధర చెల్లించడంలో సరైన న్యాయం పాటించడం లేదంటూ రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వరంగల్ ఎనమాముల మార్కెట్ లో ఓ న్యాయం అమలువుతంటే పెద్దపల్లి మార్కెట్ లో మరో న్యాయం అమలు చేస్తున్నారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం క్వింటాలు పత్తికి రూ. 7700 చెల్లిస్తే, మంగళవారం 5,500 మాత్రమే చెల్లించారని బుధవారం రూ. 7,100 మాత్రమే ధరగా నిర్ణయించారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండ బుధవారం మార్కెట్ కు తీసుకొచ్చిన పత్తిలో కేవలం 50 బస్తాలను మాత్రమే సెలక్ట్ చేశారని మిగతా పత్తిని కొనుగోలు చేసేందుకు విముఖత చూపుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉందని మార్కెట్ కు చేరుకున్న తరువాత చెప్పడం ఏంటని, ముందుగానే తమకు సమాచారం ఇస్తే అలాగే పత్తిని తీసుకొచ్చేవారమని రైతులు అంటున్నారు. అల్లంత దూరం నుండి తీసుకొచ్చిన తరువాత తేమ శాతం పేరిట కొర్రీలు పెడుతూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రవాణా ఛార్జీలు, బస్తాల్లో తొక్కించిన ఛార్జీలతో పాటు ఇతరాత్ర భారం తమపై పడుతోందని రైతులు తెలిపారు. అయితే ఎనమాముల మార్కెట్ లో అమలు చేసినట్టుగా పెద్దపల్లి మార్కెట్ లోనూ అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో సెలక్ట్ అయిన పత్తికి అక్కడిలాగే ధర చెల్లించి, సెలక్ట్ కానీ పత్తికి రూ. 100 లేదా 200 తగ్గించి పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దాదాపు రెండు గంటలుగా పెద్దపల్లి రాజీవ్ రహదారిపై రైతులు ఆందోళన చేస్తుండడంతో వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలీసులు అక్కడకు చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేస్తున్నా ససేమిరా అంటున్నారు.
Disha Dasha
1884 posts
Prev Post