ఎమ్మెల్యే గంగుల కుటుంబ సభ్యులను వెంటాడుతున్న వ్యతిరేకత…

అసోసియేషన్ ఆఫీసు ముందే నిరసన

దిశ దశ, కరీంనగర్:

మాజీ మంత్రి, కరీంనగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులపై వ్యతిరేకత వెంటాడుతూనే ఉంది. గ్రానైట్ ఫ్యాక్టరీ అసోసియేషన్ బాద్యల తీరుకు వ్యతిరేకంగా ఇంతకాలం హెచ్చిరకలు చేస్తూ వచ్చిన ఓనర్స్ ఇఫ్పుడు ఏకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. అసోసియేషన్ పాలకవర్గం తీరుపై మండిపడుతున్న వీరు ఇప్పటికే మూడు సార్లు వార్నింగ్ ఇచ్చారు. అసోసియేషన్ కు సంబంధించిన లెక్కలు చూపించాలని, జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించాలని ఫిబ్రవరి నుండి ఫ్యాక్టరీల యజమానులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. వాట్సప్ కు స్పందించకపోవడం లేదంటూ గతంలోనే ఓనర్లు ఆరోపణలు చేశారు. అయితే తాము వినిపిస్తూ వస్తున్న డిమాండ్ కు అనుగుణంగా మాత్రం వ్యవహరించడం లేదంటూ అసోసియేషన్ పాలకవర్గం తీరుపై యజమానులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. గురువారం ఏకంగా అసోసియేషన్ కార్యాలయం ముందే నిరసన కార్యక్రమం చేపట్టారు. అసోసియేషన్ కు సంబంధించిన నిధులు కూడా లెక్కలు లేకుండానే ఖర్చు చేశారని, ఇందులో సభ్యులు చెల్లించిన డబ్బు ఎంత ఉంది అన్న వివరాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పదేళ్లుగా చేసిన ప్రతి లెక్కను వివరించాల్సిందేనని, లేనట్టయితే ఎన్ని కోట్లు మోసం చేశారోనన్న భావన ఉందన్నారు. సభ్యుల ఆమోదం లేకుండా చెప్పకుండా మీ ఆనందం కోసం దేశ విదేశాలకు వెళ్లారంటూ ఓనర్లు ఆరోపించారు. అసలు అసోసియేషన్ బిల్డింగ్, షట్టర్స్ ఎవరి పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉంది..? పర్మిషన్ ఎవరి పేరిట ఉందో కూడా తెలియాలన్నారు. 10ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. అసోసియేషన్ బాడీని రద్దు చేయాలని కూడా ఫ్యాక్టరీస్ ఓనర్లు డిమాండ్ చేశారు. అయితే ఈ కమిటీకి అధ్యక్షుడిగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బావ శంకర్ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, ప్రధాన కార్యదర్శిగా ఆయన అన్న కొడుకు ప్రదీప్ వ్యవహరిస్తున్నారు.

ఆఫీసుకు తాళం:..

మరో వైపున గ్రానైట్ అసోసియేషన్ వద్ద ఓనర్లు నిరసన కార్యక్రమానికి ముందే బిల్డింగ్ కు చుట్టూ కూడా తాళాలు వేసి ఉండడాన్ని సభ్యులు తప్పు పట్టారు. అసోసియేషన్ బిల్డింగుకు, చుట్టు ఉన్న గేట్లకు తాళాలు వేసుకోవడం ఏంటంటూ వారు ప్రశ్నించారు. ఏది ఏమైనా మాజీ మంత్రి గంగుల కమలాకర్ బావ శంకర్, అన్న కొడుకు ప్రదీప్ లు ఒంటి చేత్తో నడిపించిన అసోసియేషన్ సభ్యులు నిలదీస్తున్న తీరు మాత్రం రచ్చకెక్కినట్టయింది.

You cannot copy content of this page