పిల్లలతో అనుబంధాలు లేకుండా పోయాయ్…
టీజీఎస్పీ పోలీసుల భార్యల నిరసన
దిశ దశ, వరంగల్:
శాంతి భద్రతల పరిరక్షణలో తలమునకలయ్యే పోలీసుల భార్యలు ఆవేదనతో ఆందోళన బాట పట్టారు. తెలంగాణ స్పెషల్ పోలీసు విభాగంలో పనిచేస్తున్న పోలీసు యంత్రాంగానికి వారి వారి కుటుంబాలతో అనుభందం లేకుండా పోతోంది. భార్యలను, పిల్లలను పట్టించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. సివిల్, ఏఆర్ పోలీసుల్లాగా టీజీఎస్పీ పోలీసులను కూడా చూడాలి. తరుచూ బదిలీలు చేస్తుంటే పిల్లల చదువులపై ప్రభావం చూపుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం వరంగల్ సమీపంలోని మామ్నూరు 4వ బెటాలియన్ క్యాంప్ వద్ద కానిస్టేబుళ్ల భార్యలు నిరసన చేపట్టిన తీరు సంచలనంగా మారింది. ఇతర పోలీసు విభాగాల్లో పని చేస్తున్న వారికి ఎలాంటి విధానం అమల్లో ఉందో టీజీఎస్పీ విభాగంలో పనిచేసిన పోలీసులకు కూడా అదే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కసారిగా టీజీఎస్పీ పోలీసుల కుటుంబాలు మామ్నూరు క్యాంపు వద్దకు చేరుకోవడంతో పోలీసు అధికారులు హుటాహుటిన ఆర్టీఓ ఆఫీసు నుండి భారీ బందోబస్తు చేపట్టారు. తమ పిల్లలు కూడా డాడికి దూరంగా బ్రతుకుతుండడంతో సింగిల్ పేరెంటింగ్ అన్న భావనకు వచ్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ చేసినప్పడు కూడా తమతో ప్రశాంతంగా మాట్లాడడం లేదని అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో తమ భర్తలు విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. నెలకొసారి సెలవులపై ఇంటికి వచ్చినా ఎప్పుడు మూవ్ మెంట్ పేరిట కాల్ వస్తుందోనన్న భయంతోనే కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు తప్ప, తమతో ఉన్నామన్న ఆనందం మాత్రం తమ భర్తల ముఖాల్లో కనిపించడం లేదన్నారు. క్యాంపులో కూడా ఏర్పాటు చేసిన మెస్ లో ఆహారం సరిగా ఉండడం లేదని, నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. తరుచూ బదిలీలు జరుగుతుండడంతో స్థిరంగా ఉండలేకపోతున్నారని, దీంతో తమ బిడ్డల చదువులకు కూడా ఆటంకం కలుగుతోందని వివరించారు. తమ బాగోగులు చూసుకుంటారని తమ తల్లిదండ్రులు పెళ్లిల్లు చేస్తే భర్తలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులే కాకుండా ఇంటికి వచ్చినప్పుడు భయం భయంగా కాలం వెల్లదీస్తున్నారన్నారు. దీంతో తాము పెళ్లి చేసుకుని కూడా భర్తలను కలవకుండా జీవించాల్సిన దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్డర్లీ వ్యవస్థ కొనసాగిస్తుండడంతో విధులతో సంబంధం లేని పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. క్యాంపులో గడ్డి పీకడం వంటి పనులు కూడా తమ భర్తలే చేయాల్సి వస్తోందని వాపోయారు. ఏక్ పోలీసింగ్ విధానం అమలు చేసి టీజీఎస్పీ కానిస్టేబేళ్ల విషయంలో కూడా సమన్యాయం పాటించాలని డిమాండ్ చేశారు.