సిబ్బందికి జీతాల్లేవు… గ్రామస్థులకు నీళ్లు లేవు

దిశ దశ, మానకొండూరు:

నాలుగు రోజులుగా నీళ్లు రావడం లేదు… ఛాయ్ తాగుదామన్నా నీటి చుక్క లేదు… మా దాహార్తిని తీర్చండి మహాప్రభో అంటూ ఆ గ్రామస్థులు ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. పంచాయితీ సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదని వాళ్లే మోటారు కనెక్షన్ తొలగించారని కూడా వారు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునూరు వాసులు తమకు తాగు నీళ్లు రాకపోవడంతో గోస పడుతున్నామంటూ నిరసన చేపట్టారు. వచ్చునూరు సెంటర్ లో ఖాళీ బిందెలతో నిరసన చేపట్టి తమకు తాగు నీరందించేందుకు అధికారులు వెంటనే చొరవ చూపాలని కోరారు. అయితే పంచాయితీ సిబ్బంది ఇద్దరికి గత ఏడాది కాలంగా వేతనాలు ఇవ్వకపోవడంతో వారు మోటారు కనెక్షన్ తీసేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీంతో నాలుగు రోజులుగా తాగు నీరు లేక అవస్థలు పడుతున్నామని గ్రామస్థులు చెప్తున్నారు. పంచాయితీ సిబ్బంది జీతాల గురించి అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వెంటనే గ్రామంలో తాగు నీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. వచ్చునూరు వాసుల తాగు నీటి కష్టాలను పరిష్కరించాలని, పంచాయితీ సిబ్బంది వేతనాలు ఇవ్వాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా నాయకుడు బండారి శేఖర్ డిమాండ్ చేశారు.

పచ్చునూరు సెంటర్ ఖాలీ బిందెలతో మహిళాల నిరసన

You cannot copy content of this page