కీడు వంటకాలు నిర్వహించిన గ్రామస్థులు
దిశ దశ, హుజురాబాద్:
ఒకరు కాదు ఇద్దరు కాదు… పది మందికి పైగా నెల రోజుల్లోనే మృత్యువాత పడ్డారు. చిన్న గ్రామంలో చోటు చేసుకున్న వరస మరణాలు ఈ ఊరి ప్రజలను కలిచివేశాయి. తమ గ్రామానికి చెందిన వారు మృత్యువు ఒడిలోకి చేరిపోతున్న తీరు వారిని ఆందోళనకు గురి చేసింది. గ్రామానికి చెందిన కళ్ల ముందే విగత జీవులుగా మారుతున్నారెందుకన్నదే అంతు చిక్కకుండా పోయింది. ఎలాగైనా ఈ మరణ మృదంగాన్ని నిలిపివేయాలని అనకున్నారు. పురోహితుడిని అడిగితే ఊరికి కీడు సోకినట్టుగా ఉంది వేకువ జామునే ఊరంతా వెల్లి సామూహిక కీడు భోజనాలు చేయాలని సూచించారు. దీంతో ఆ గ్రామస్థులంతా ఊరు విడిచి కీడు వంటలు చేసుకునేందుకు వెళ్లారు. తెలంగాణాలోని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో గత నెల రోజుల్లో 10కి పైగా మరణాలు సంభవించాయి. పురోహితుడు సూచించిన విధంగా గురువారం గ్రామస్థులంతా తెల్లవారక ముందే గ్రామం వదిలి వెళ్లి పోయారు. ఇండ్లకు తాళాలు వేసి వంట సామాగ్రి వెంటబెట్టుకుని మరీ శివార్లలోకి వెల్లి సామూహిక కీడు వంటల కార్యక్రమం జరుపుకున్నారు. చీకటి పడిన తరువాత గ్రామస్థులు తిరిగి ఇండ్లకు చేరుకుంటారని తెలిసింది. గతంలోనూ ఇదే విధంగా వరస మరణాలు సంభవించినప్పుడు కీడు వంటకాల కార్యక్రమం చేపట్టామని అప్పటి నుండి గ్రామంలో ఇలాంటి మరణాలు జరగలేదని తెలిపారు. తాజాగా మళ్లీ వరస మరణాలు సంభవిస్తుండడంతో కీడు వంటకాల కార్యక్రమం చేపట్టామని వివరించారు.