కంబోడియాలో తెలుగు యువకుల కష్టాలు…
ఆందోళన చేపట్టిన నిరుద్యోగులు
దిశ దశ, అంతర్జాతీయం:
ఉపాధి ఆశ చూపించి సైబర్ నేరాలకు పాల్పడాలంటూ హింసిస్తున్నారని తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంబోడియా దేశంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తమ వద్ద డబ్బులు నకిలీ ఏజెంట్లు తమను మోసపుచ్చారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరా కంబోడియాకు చేరుకున్న తరువాత కాల్ సెంటర్లకు తరలించి తమతో ఇండియన్స్ కు కాల్స్ చేయిస్తున్నారన్నారు. బారతీయులకు ఫోన్లు చేసి సైబర్ నేరాలకు పాల్పడుతూ వారి నుండి డబ్బులు డ్రా చేయించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఒక్క సారిగా కంబోడియాలోని కాల్ సెంటర్లలో పనిచేస్తున్న తెలుగు యువకులు రోడ్డు పైకి వచ్చి ఆందోళన చేయడంతో అక్కడి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
సిరిసిల్లతో వెలుగులోకి…
ఏప్రిలో నెలలో రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు గ్రామానికి చెందిన అతికం లక్ష్మీ స్థానిక ఎస్పీ అఖిల్ మహాజన్ ను కలిసి తన కొడుకు కంబోడియాలో ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. దీంతో అప్పుడే వీడియో కాల్ చేసిన ఎస్పీ మహాజన్ బాధితుని నుండి పూర్తి వివరాలు సేకరించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన కంచర్ల సాయి ప్రసాద్ ను అరెస్ట్ చేసి కంబోడియాలోని ఎంబసీ అధికారులతో మాట్లాడారు. ఈ క్రమంలో అక్కడ చిక్కుకున్న పెద్దూరుకు చెందిన శివ ప్రసాద్ ను ఇండియాకు రప్పించగలిగారు. అయితే అక్కడ తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 500 మంది యువకులను చైనీస్ కంపెనీ సైబర్ నేరాలు చేయిస్తోందని బాధితుడు పోలీసులకు వివరించాడు.
రెండు రోజుల క్రితం…
కంబోడియా దేశంలో జరుగుతున్న ఈ తతంగం గురించి వైజాక్ సిటీ పోలీసులకు కూడా ఫిర్యాదు వెల్లడంతో సీపీ రవి శంకర్ అయ్యన్నార్ కూడా కంబోడియా కేంద్రంగా జరుగుతున్న సైబర్ క్రైం స్కాం గురించి మీడియాకు వివరించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశామని, కంబోడియా దేశంలో ఉన్న తెలుగు రాష్ట్రాల యువకులకు ఇండియాకు రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇదే సమయంలో కంబోడియా సైబర్ క్రిమినల్స్ వలలో చిక్కుకున్న బాధితులు కూడా రోడ్డు ఎక్కి ఆందోళన చేయడం గమనార్హం. ఆందోళనలకు చెందిన వీడియోలను వైజాక్ పోలీసులకు కూడా పంపించారు. దీంతో కంబోడియాలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు మరోసారి బయటపడ్డాయి.
ఉపాధి పేరిట…
నెలకు రూ. 600 డాలర్ల వరకూ వేతనం ఇస్తామని, రూ. లక్షా 50 వేలు చెల్లించాల్సి ఉంటుందని బ్రోకర్ల ద్వారా కంబోడియాకు చెందిన పలువురు ఆఫర్లు ఇస్తున్నారు. వీరి మాటలు నమ్మిన స్థానిక బ్రోకర్లు నిరుద్యోగులకు వల వేయడం మొదలు పెట్టారు. నిరుద్యోగుల నుండి రూ. లక్షా 50 వేల వరకు వసూలు చేస్తున్న బ్రోకర్లు ఇండియాలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న మీడియేటర్ల ద్వారా డబ్బులు పంపించి వీసాలు తెప్పిస్తున్నారు. ఇందులో రూ. 70 నుండి 80 వేల వరకు మీడియేటర్లు కమిషన్లు తీసుకుంటుండగా మిగతా నగదును కంబోడియాలోని సైబర్ క్రిమినల్ గ్యాంగులు తీసుకుంటున్నాయి. ఉపాధి దొరికిందన్న సంతోషంతో కంబోడియాకు చేరుకున్న ఇక్కడి యువకులకు చుక్కలు చూపిస్తున్నారు నిర్వాహకులు. వారి పాస్ పోర్టులు లాక్కుని ఓ గదిలో వేసి ఇండియన్స్ కు కాల్ చేయిస్తు డబ్బులు గుంజే పనులకు పురమాయిస్తున్నారు. వారిని బెదిరింపులకు గురి చేస్తుండడంతో బయటకు చెప్పుకోలేక భయం భయంగా కాలం వెల్లదీస్తున్నారు. తాము బయటకు వెల్తే పాస్ పోర్టు లేదన్న కారణంతో అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉంటుందన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. దీంతో పాటు చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో ఇంటర్నేషనల్ సైబర్ క్రిమినల్ గ్యాంగుల చెరలోనే మగ్గిపోతున్నారు. బాధితులు ధైర్యం చేసి ఇక్కడి పోలీసులకు సమాచారం చేరవేయడంతో ఇక్కడి పోలీసు అధికారుల చొరవతో ఒకరిద్దరు సేఫ్ అవుతున్నారు. అయితే కంబోడియా దేశంలో ఉన్న వందలాది మంది తెలుగు రాష్ట్రాల యువకులచే అక్కడి సైబర్ క్రిమినల్స్ కోట్లలో స్కాం చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మానవ అక్రమ రవాణాపై ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో కూడా చర్చలు జరిపి కంబోడియాలో ఉన్న తెలుగు యువకులను స్వస్థలాలకు రప్పించే పనిలో నిమగ్నం అయ్యారు విశాఖ పోలీసులు.