మూడు చోట్లా ఒకే సమస్య
దిశ దశ, పెద్దపల్లి:
పారిశ్రామిక రంగంతో పాటు మేధావుల పుట్టినిల్లుగా ప్రసిద్ది గాంచిన పెద్దపల్లి జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీ వైవిధ్యమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఈ జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాల్లోనూ భిన్న పరిస్థితులు నెలకొనడం అధిష్టానానికి ఇబ్బందికరంగా మారింది. జిల్లాలో నెలకొన్న విషయాలపై పార్టీ పెద్దలు కూడా క్లారిటీ ఇవ్వకపోవడంతో క్యాడర్ లోనూ అయోమయం నెలకొంది. సిట్టింగుల్లో చాలా మందిని మార్చేది లేదని చెప్తున్న ఏ అభ్యర్థికి ఈ సారి అవసకాశం ఉంటుంది అన్నది తేలకపోవడం వల్ల కూడా ప్రచారాలు ఎక్కువగా సాగుతున్నాయి.
పెద్దపల్లిలో…
సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి పార్టీ క్యాడర్ కు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన కొంతమందికి మాత్రమే ప్రయారిటీ ఇస్తుండడంతో మిగతా వారు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రాజకీయేతర శక్తుల చెప్పుచేతల్లో నడుస్తున్నాడని, దీంతో ఉద్యమకారులు, పార్టీ సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఉద్యమకారులు రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకుని దాసరి మనోహర్ రెడ్డి తీరుపై చర్చలు జరిపారు. కొంతమంది ఇతర పార్టీల్లో చేరిపోగా… ఇటీవల మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కూడా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. భూ కబ్జాల అంశంలోనూ ఆయనపై ఆరోపణలు తలెత్తుతుండడంతో పాటు ఆయనకు సొంతపార్టీ నుండి కూడా పోటీ తీవ్రంగా నెలకొంది. ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద రావు, జడ్పీటీసీ లక్ష్మణ్, నల్ల మనోహర్ రెడ్డిలు టికెట్ ఆశిస్తున్న జాబితాలో ఉన్నారు. అధిష్టానం పెద్దలతో టచ్ లో ఉంటున్న వీరిలో ఎవరో ఒకరికి టికెట్ ఖాయం అన్న ప్రచారం జరుగుతుండగా, మనోహర్ రెడ్డిని మార్చాలన్న యోచనలో ఉన్నారన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. దీంతో ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయోమయం జగన్నాథం అన్నట్టుగానే తయారైందని చెప్పక తప్పదు. వ్యతిరేకతలను చల్ల బర్చుకునేందుకు మనోహర్ రెడ్డి చొరవ చూపడం లేదని అందరినీ తక్కువగా అంచనా వేస్తున్నారని దీనివల్ల చాలా మంది కూడా ఆయనపై కినుక వహించారన్న చర్చ సాగుతోంది. మరో వైపున ఇసుక రీచుల వ్యవహారం సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో ఆయనకు తీరని నష్టాన్ని చేకూర్చనుందని అంటున్న వారూ లేకపోలేదు. అధిష్టానం జోక్యం చేసుకుని పెద్దపల్లి పార్టీలో నెలకొన్న అంతర్గత బేధాభిప్రాయాలు సద్దుమణిగితే తప్ప వ్యతిరేక పవనాలు తగ్గించుకునే పరిస్థితి లేదని అంటున్న వారే ఎక్కువ.
కోరుకంటి కయ్యం…
పెద్దపల్లి జిల్లా పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై ముఖ్య నాయకులంతా కూడా అగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి బహిరంగ రహస్యమే. ఆయన తన సొంత మనుషులను తప్ప వేరే వారిని పట్టించుకోవడం లేదని, తమపై కేసులు కూడా పెట్టించారని అధిష్టానానికి ఫిర్యాదు చేశారంటే పరిస్థితి ఎక్కడికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. చివరకు నియోజకవర్గ పరిస్థితులను పర్యవేక్షించేందుకు మంత్రి కొప్పుల ఈశ్వర్ కు బాధ్యతలు ఇచ్చారంటే ఇక్కడి నాయకత్వంపై వ్యక్తమవుతున్న అసమ్మతి ఎలా ఉందో గమనించవచ్చు. కార్పోరేటర్లు కూడా కొంతమంది బయటకు రాకుండా కోరుకంటికి వ్యతిరేకంగా సమీకరణాలు నెరుపుతున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వన్ ఆర్మీ అన్నట్టుగా వ్యవహరిస్తున్న చందర్ సొంత ఏజెండా పెట్టుకుని తనవారు చెప్పినట్టే నడుచుకుంటున్నారు తప్ప పార్టీ సీనియర్లను ఏ మాత్రం ఖాతరు చేయడం లేదన్న ఫిర్యాదుల పరంపరం పెరిగిపోయింది. ఆర్ఎఫ్ సీఎల్ ఉద్యోగాలు ఇష్యూలో కూడా అధికార పార్టీ నాయకుల భాగస్వామ్యం ఉండడం బాధితుల వద్ద తీసుకున్న డబ్బులు కోట్ల వరకూ చేరడం కూడా గులాభి పార్టీకి ఇబ్బందికరంగా మారింది. కాంట్రాక్టు బేస్ ఉద్యోగాలే అయినా పర్మినెంట్ ఉద్యోగాలని మాయమాటలు చెప్పి డబ్బులు దండుకున్న వారిలో అధికార పార్టీకి చెందిన వారూ ఉండడం శాపంగా మారింది. అటు పార్టీ క్యాడర్ తో కమ్యూనికేషన్ గ్యాప్ ఇటు కొన్ని వర్గాలతో దూరంగా ఉండడం వల్ల కూడా అధికార పార్టీ నాయకులకు ఇబ్బందికరంగా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మంథని ఎవరిది..?
పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న పుట్ట మధు ఈ నియోజకవర్గానికి పార్టీ ఇంఛార్జిగా కూడా ఉన్నారు. పార్టీలో ఆయనకు పోటీగా టికెట్ ఆశిస్తున్న వారు కూడా లేరు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం అభ్యర్థిని మార్చుతారన్న ప్రచారం ఊపందుకుంది. రెండేళ్లకు పైగా సాగుతున్న ఈ ప్రచారం నిజమేనని బీఆర్ఎస్ అధిష్టానం చెప్పడం లేదు… పుట్ట మధే తమ నాయకుడని ఘంటాపథంగా ప్రకటించిడం లేదు. దీంతో రోజుకో పేరు తెరపైకి వస్తుండడంతో అసలు పుట్ట మధుకు టికెట్ ఇస్తారా ఇవ్వారా అన్న గందరగోళానికి పరోక్షంగా అధిష్టానం చర్యలే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ సారి స్వర్గీయ ప్రధాని పివి కూతురు వాణి, కాళేశ్వరం ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ మధుసూధనా చారి, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణల, కాటారం ప్రాంతానికి చెందిన చల్ల నారాయణ రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మరో వైపున బహుజన నినాదంతో పుట్ట మధు పావులు కదుపుతూ తన పట్టు నిలుపుకునే ప్రయత్నాల్లో మునిగారు. అటు పార్టీ క్యాడర్… ఇటు సొంత క్యాడర్ ను బలోపేతం చేసేందుకు వ్యూహాత్మక ఎత్తులతో పుట్ట మధు మునిగి తేలుతున్నారు. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వరకు పుట్ట మధుపై మంథనిలో దుమారం లేచింది. అయితే అనూహ్యంగా స్థానిక సంస్థల ప్రతినిధుల సమావేశంలో మంథని పార్టీ ప్రతినిధి పుట్ట మధేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ తరువాత కొంతకాలానికి మళ్లీ పుట్ట మధుకు ప్రత్యామ్నాయ నాయకుని కోసం అధిష్టానం ప్రయత్నిస్తోందన్న ప్రచారం ఊంపదుకుంది. తిరిగి ఇటీవల ముఖ్యమంత్రి, మంత్రులను పుట్ట మధు అసెంబ్లీలో కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తాజాగా మరో ఇద్దరి పేర్లు తెరపైకి వస్తున్నాయి. దీంతో మంథని బీఆర్ఎస్ క్యాడర్ లో అంతా అయోమయం నెలకొందన్నది వాస్తవం. అధిష్టానం నాన్చుడు ధోరణిని అవలంభిస్తుండడంతోనే ఇక్కడి పరిస్థితులు వైవిద్యంగా మారాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది మంథని శ్రేణుల్లో ఇంకా గందరగోళ పరిస్థితులు నెలకొని ఉండడం గమనార్హం. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కూడా డిఫరెంట్ వాతావరణం నెలకొని ఉండడం బీఆర్ఎస్ అధిష్టానానికి ఇబ్బందికరంగా మారిందనే చెప్పొచ్చు. అభ్యర్థులను మార్చితే ఎలా ఉంటుంది..? లేనట్టయితే ఎలా ఉంటుంది అన్న విషయంపై అధిష్టానం గ్రౌండ్ రియాల్టి తెలుసుకుంటున్నట్టుగా సమాచారం.