ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు బెయిల్
దిశ దశ, న్యూఢిల్లీ:
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు దేశ అత్యున్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్ పోర్ట్. డిపాజిట్ చేయాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దన్న కండిషన్లు విధిస్తూ బెయిల్ మంజూరు చేసింది. సుప్రీం కోర్ట్ లో డాక్యుమెంట్స్ సమర్పించి బెయిల్ ఆర్డర్ తీసుకునే పనిలో టీఆర్ఎస్ నేతలు తన్నీరు హరీష్ రావు, కల్వకుంట్ల తారక రామారావులు నిమగ్నమయ్యారు. మంగళవారం సాయంత్రం లేదా బుధవారం ఉదయం వరకు కవిత తిహాడ్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని, ఈడీ దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఆమె ఇక జైల్లో ఉండాల్సిన అవసరం లేదని, మహిళలకు ఉండే హక్కులను పరిగణనలోకి తీసుకోవల్సిన అవసరం ఉందని అందుకే బెయిల్ ఇస్తున్నామని స్పష్టం చేసింది.
వాదనలు ఇలా…
సుప్రీం కోర్టులో కవిత బెయిల్ విషయంలో వాద ప్రతివాదనలు ఇలా జరిగాయి. కవిత తరపున సుప్రీంకోర్టు ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈడీ, సీబీఐ కేసులో విచారణ ఇప్పటికే పూర్తయ్యిందన్నారు. ఈడీ కేసులో 5 నెలలుగా జైలులో ఉన్నారని, సీబీఐ కేసులో 4 నెలలుగా జైలులో ఉన్నారని వివరించారు.
493 మంది సాక్షుల విచారణ ముగిసిందని, ఈ
కేసులో ఛార్జ్‌షీట్లు కూడా దాఖలు చేశారని తెలిపారు. కవిత దేశం విడిచి పారిపోయే అవకాశం లేదని, ఆమెకు బెయిల్ పొందే అర్హత ఉందన్నారు. రూ.100 కోట్లు చేతులు మారినట్టు ఆరోపణలు మాత్రమేనని,
కవిత ఎవరినీ బెదిరించలేదన్న విషయం గుర్తించాలని కోరారు. ఫోన్లు, కార్లు మారుస్తూ ఉంటారని వాదించగా ప్రతిరోజూ ఫోన్లు మారుస్తారాఅని ప్రశ్నించిన సుప్రీంకోర్ట్ ప్రశ్నించింది.ఈడీ తరపున న్యాయవాది ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఈడీ నోటీస్ రాగానే అన్ని ఫోన్లను ధ్వంసం చేశారని సుప్రీంకోర్టుకు తెలిపారు. ఫోన్లను ఫార్మాట్ చేసి ఇంట్లో పనిచేసేవారికి ఇచ్చారన్నారు. సాక్ష్యాలను కవిత తారుమారు చేశారని, ఫోన్‌లో సమాచారం అంతా కూడా ధ్వంసం చేశారని వివరించారు. కవిత ఫోన్లలో 10 రోజుల డేటా మాత్రమే రికవరీ వచ్చిందని,
విచారణ సమయంలో కవిత సహకరించలేదని తెలిపారు. ఫోన్‌లో డేటా ఎక్కువైనప్పుడు డిలీట్ చేయడం సాధారణమే కానీ ఫార్మాట్ చేయడం సహజం కాదన్నారు. ఇరువురి వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది.