ఏకంగా ఆర్టీసీ బస్సులోనే టవల్ తో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ ఉమ్మడి జిల్లాలో జరిగింది. నాలుగు రోజులు సెలవు తీసుకున్న కండక్టర్ సడన్ గా డ్యూటీలో చేరి నేరుగా వెల్లి సూసైడ్ చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. తొర్రూరు ఆర్టీసీ డిపోలోని బస్సులో కండక్టర్ గార్లపాటి మహేందర్ రెడ్డి (55) టవల్ తో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 9 నుండి 12 వరకు అనారోగ్యం కారణంగా సెలవుపై వెల్లిన మహేందర్ రెడ్డి ఆదివారమే డ్యూటీలో చేరారు. సోమవారం తిరిగి విధుల్లో చేరాల్సిన మహేందర్ రెడ్డి ఆదివారం ఉదయం 11 గంటలకు విధుల్లో చేరారు. తన లీవ్ క్యాన్సిల్ చేసుకుని ముందుగానే డ్యూటీకి వచ్చి ఉంటాడని ఆర్టీసీ డిపో సిబ్బంది భావించారు. అయితే డిపోలో పార్క్ చేసి ఉన్న బస్సులోకి వెల్లిన మహేందర్ రెడ్డి తన వెంట తెచ్చుకున్న టవల్ తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్నట్టుండి అర్థాంతరంగా సెలవు క్యాన్సిల్ చేసుకుని ఆయన విధుల్లో ఎందుకు చేరాడు, డిపోలోకి వచ్చి రాగానే ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటీ అన్న మిస్టరీ తేలాల్సి ఉంది. కుటుంబ సభ్యుల నుండి వివరాలు సేకరించిన తరువాత ఓ క్లారిటీకి వస్తామని పోలీసులు చెప్తున్నారు. మృతునికి భార్య అరుణ, కుమారులు విక్రమ్ వినయ్ లు ఉన్నారు.