నాన్చుడు ధోరణిలో అధిష్టానం
దిశ దశ, మంథని:
మంథని బీఆర్ఎస్ పార్టీలో క్యాడర్ అంతా అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది. అధిష్టానం అధికారికంగా చెప్పకపోయినా ఆయనను పక్కన పెట్టారంటూ ప్రచారం చేస్తున్నారు కొంతమంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆయనకు దక్కదంటున్న వారు కొందరైతే టికెట్ తమకే ఇవ్వాలంటూ పావులు కదుపుతున్నారు మరికొందరు. అసలా సెగ్మెంట్ లో ఏం జరుగుతోంది… అక్కడి బీఆర్ఎస్ శ్రేణుల పరిస్థితి ఏంటో అర్థం కాక సామాన్య క్యాడర్ జిగ్ జాగ్ అవుతోంది.
గులాభి వనంలో అలా ఎలా…
మంథని గులాభి వనంలో సాగుతున్న తీరుపై సొంతపార్టీలోనూ గందరగోళం నెలకొన్నది వాస్తవం. ఇటీవల కాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో పుట్ట మధును విషయంలో అధిష్టానం గుర్రుగా ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మధు అసమ్మతి వర్గం కూడా ఆయనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోయిందంటూ ప్రచారం చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు పుట్ట మధును ఆకాశానికెత్తిసింది అధిష్టానం. మంథని క్యాంపుకు హాజరైన మంత్రి కేటీఆర్ పుట్ట మధు దంపతులను అక్కున చేర్చుకుని మరీ మాట్లాడారు. ఇదే సమావేశంలో మంథని స్థానిక సంస్థల ప్రతినిధులు కొందరు పుట్ట మధు పరిస్థితి ఏంటని కేటీఆర్ ను ప్రశ్నించారు కూడా. దీంతో మంత్రి కేటీఆర్ కూడా అలాంటిదేమీ లేదు మంథని ఇంఛార్జి పుట్ట మధే రానున్న ఎన్నికల్లో మధుకే టికెట్ ఎవరు కాదన్నా అవునన్న మంథని అంటే మధేనని కుండబద్దలు కొట్టారు. దీంతో కొంతకాలం పుట్ట మధు విషయంలో అసమ్మతీయుల్లో స్తబ్దత నెలకొంది. తిరిగి పుట్ట మధును కొన్ని సమావేశాలకు ఆహ్వానించలేదని దీంతో మళ్లీ అధిష్టానం గుర్రుగా ఉందటూ మళ్లీ ప్రచారం చేయడం ఆరంభించారు. ఇదే క్రమంలో పుట్ట మధు కూడా బహుజన వాదం పల్లవి ఎత్తుకుని బ్రహ్మణ ఆదిపత్యానికి వ్యతిరేంగా నినదించడం మొదలు పెట్టారు. ప్రొఫెసర్ కదిరె కృష్ణ ప్రత్యేకంగా మంథనిలో బహుజన వాద సమావేశం నిర్వహిస్తే ఈ సమావేశానికి పుట్ట మధు దంపతులు అటెండ్ అయ్యారు. దీంతో పుట్ట మధు పయనమెటు వైపు అన్న చర్చను తెరపైకి తీసుకొచ్చారు. ఇటీవల కాలంలో పుట్ట మధును పార్టీ పట్టించుకోవడం లేదని ప్రత్యామ్నాయ నేత కోసం చూస్తున్నారంటూ ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. కానీ అలాంటి సంకేతాలు మాత్రం బీఆర్ఎస్ అధిష్టానం ఇవ్వకపోవడం గమనార్హం.
ఇదెలా మరీ..?
పుట్ట మధును పార్టీ పక్కనపెట్టినట్టయితే ఇటీవల నామినేటెడ్ పదవులు అప్పగించారు. ఇందులో పుట్ట మధు ఇచ్చిన జాబితాకే అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నామినేటెడ్ పదవులు పొందిన వారంతా కూడా సోమవారం నాడు బాధ్యతలు కూడా చేపట్టబోతున్నారు. ఒక వేళ అధిష్టానం పుట్టను పక్కన పెట్టినట్టయితే నామినేటెడ్ పదవులకు ఆయన పంపిన జాబితాకు ఎలా ఓకె చెప్తుందన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎప్పటి జాబితానో అయినప్పటికీ అధిష్టానం తల్చుకుంటే కొత్త జాబితా తెప్పించుకుని పుట్ట మధు పంపిన ప్రతిపాదనలు చెత్తబుట్టలో పడేసేవారు కదా అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరో వైపున అధిష్టానం మెప్పు కోసం మాత్రం ప్రగతి భవన్ పెద్దలను మచ్చిక చేసుకునే పనిలో మరికొంతమంది నాయకులు నిమగ్నం అయ్యారు.
గందరగోళంలో క్యాడర్…
అసమ్మతీయులు ప్రచారం… అదిష్టానం వ్యవహారం తీరుతో సామాన్య కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారన్నది వాస్తవం. మంథనిలో సాధారణ కార్యకర్తల పరిస్థితి ఎలా తాయరైందంటే పట్టుమంటే పాముకు కోపం విడవమంటే కప్పకు కోపం అన్నట్టుగా కాలం వెల్లదీస్తున్నారు. మింగలేక కక్కలేక అన్నట్టుగా ఉన్న సామాన్య కార్యకర్తల పరిస్థితి గురించి కూడా పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. మంథని ముఖ చిత్రాన కొత్త ముఖానికే అవకాశం ఉంటుందనో లేక పుట్ట మధే పార్టీ ఇంఛార్జనో చెప్పినట్టయితే క్యాడర్ ఓ క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. అధిష్టానం నాన్చుడు ధోరణి వల్ల ప్రతిపక్ష పార్టీలను బలోపేతం చేసినట్టు అవుతున్నదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పుట్ట మధుపై అధిష్టానం వైఖరి ఏంటో స్పష్టత ఇస్తే క్యాడర్ కూడా పార్టీ కోసం పనిచేసే అవకాశాలు ఉంటాయి. లేనట్టయితే స్తబ్దత నెలకొని పార్టీ వీక్ అయిపోతుందని… దీంతో వచ్చే ఎన్నికల్లో పార్టీ చావుతప్పి కన్ను లొట్టబోయే పరిస్థితికి చేరుకుంటుందన్న ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి.