దిశ దశ, సుల్తానాబాద్:
ఉదయం నిద్ర నుండి లేవగానే మొబైల్ ఫోన్ చూడడానికి జంకుతున్నారు ఆ పట్టణ వాసులు. రాత్రి తమతో ముచ్చట్లు పెట్టి వెళ్లిన వారు తెల్లారేసరికి నవ్వుకుంటూ కనిపిస్తాడా లేక తమను విషాదంలోకి నెట్టేస్తారా అన్న ఆందోళనలో కలవరపడిపోతున్నారు. కారణాలు ఏవైనా… అనుమానాలు ఎన్ని ఉన్నా… వాస్తవం ఏంటన్నది అంతుచిక్కకపోయినా ఆ టౌన్ పబ్లిక్ మాత్రం విషాదంతోనే కాలం వెల్లదీస్తున్నారు.
సుల్తానాబాద్ పట్టణంలో…
పేరుకు తగ్గట్టుగానే సుల్తాన్ లా జీవనం సాగిస్తున్న సుల్తానాబాద్ పట్టణ వాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి వరస మరణాలు. గత పదిహేను రోజులుగా సాగుతున్న మరణాల తీరు స్థానికులను ఆందోళనలకు నెట్టేస్తున్నాయి. తెల్లవారే సరికి వాట్సప్ ఏ దుర్వార్తను మోసుకొస్తుందో… స్టేటస్ ఎవరి మరణాన్ని చేరవేస్తుందోనన్న కలవరంతో పట్టణ వాసులు కాలం వెల్లదీస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, మునిసిపల్ మాజీ ఛైర్ పర్సన్ భర్త ముత్యం రమేష్ గౌడ్, లారీ యజమనాలు ఇలా పది మంది వరకు గుండె పోటుకు గురయి చనిపోగా మరో ఐదుగురు ఇతర అనారోగ్య కారణలతో మృత్యువు పంచన చేరారు. నిత్యం ఏదో ఇంటి నుండి ఇలాంటి విషాదకరమైన సమాచారం అందుతుండడంతో సుల్తానాబాద్ పట్టణమంతా ఇదే చర్చ సాగుతోంది. నిన్నటి వరకు తమతో కలివిడిగా తిరిగిన వ్యక్తి తెల్లారేసరికి తమను వీడి కానరాని లోకాలకు తరలిపోయాడన్న విషయాన్ని జీర్ణించుకోలేక తల్లడిల్లుపోతున్నారు పట్టణ వాసులు. వరస మరణాల కారణంగా శ్రద్దాంజలి, భాష్పాంజలి ఘటిస్తూ వెలిసిన ఫ్లెక్సీలు పట్టణమంతా దర్శనమిస్తుండడం స్థానికులను మరింత దిగాలుకు గురి చేస్తోంది.
ఈశాన్యంలో ఈశ్వరుడు…
వాస్తు ప్రకారం చూసుకున్నా పట్టణానికి ఈశాన్యం వైపున ఈశ్వరుడు కొలువై ఉన్నాడు. అయితే ఇటీవల అతి పురాతనమైన ఈ ఆలయాన్ని జీర్ణోద్దారణ కోసం పట్టణానికి చెందిన భక్తులు పునరుద్దరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో దేవాదాయ శాఖ అధికారులు అభ్యంతరాలు తెలపడంతో పునర్నిమాన పనులు నిలిపిశారు. అలాగే గత రెండున్నర దశాబ్దాల కాలంగా పట్టణంలో బొడ్రాయి లేదని, ఈ విగ్రహాలను ప్రతిష్టించకపోవడం కారణమై ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు. ఆలయాన్ని నిర్మించే ప్రక్రియ నిలిచిపోవడంతో, బొడ్రాయి లేకపోవడం వల్లే ఆ అపరాధం చుట్టుకుందన్న సెంటిమెంట్ చర్చలు కూడా జరుగుతున్నప్పటికీ ఇంతకాలం చోటు చేసుకోని మరణాలు ఇప్పుడెందుకు జరుగుతాయని ప్రశ్నిస్తున్నారు మరికొందరు.
శ్మశానంంలో అలా…
ఇకపోతే పట్టణంలోని రుద్ర భూమిలో సాగుతున్న అన్వేషణ కూడా స్థానికుల్లో కొత్త అనుమానాలకు తావిచ్చేలా చేస్తోంది. శ్మశాన వాటికలో చనిపోయిన వారిని దహనం చేసిన చోట తిరుగుతున్నారు అగంతకులు. గతంలో ఏనాడు లేని విధంగా శ్మశాన వాటికలో కొత్త వ్యక్తులు… చనిపోయిన వారి ఎముకలను ఏరుతుండడం విచిత్రంగా మారింది. రెండు రోజుల క్రితం ఇద్దరు యువకులు శ్మశాన వాటికలో సంచరిస్తుండగా స్థానికులు వారిని పట్టుకునే ప్రయత్నంలో తప్పించుకుని పారిపోయారు. బ్యాగులు తీసుకుని బైక్ పై వచ్చిన ఈ ఇద్దరు వ్యక్తులు శవాలను కాల్చిన బూడిదలో వెతికేందుకు వచ్చారని స్థానికులు అంటున్నారు. శనివారం కూడా ఇద్దరు మహిళలు శ్మశాన వాటికలో గాలిస్తుండగా వారిని పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. చనిపోయిన వారి అస్తికలను వారి కుటుంబ సభ్యులు వారి వారి ఆచారాన్ని బట్టి మూడు నుండి 9 రోజుల్లోగా సేకరిస్తారు. కాష్టం నుండి సేకరించిన ఈ ఎముకలను త్రివేణి సంగమంలో కానీ గంగా నదిలో కానీ కలిపేందుకు ప్రాధాన్యత ఇస్తుంటారు మృతుల బంధువులు. అయితే సుల్తానాబాద్ శ్మశాన వాటికలో మాత్రం శవాలను దహనం చేసిన మరునాడే అగంతకులు వచ్చి కాష్టంలోని బూడిదలో వెతుకుతున్న తీరుపై ప్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే శనివారం స్థానికులు ఇద్దరు మహిళలను పట్టుకుని ప్రశ్నించినప్పుడు తమది మంచిర్యాల జిల్లా అని చెప్తున్నారని తెలుస్తోంది. అలాగే చనిపోయిన వ్యక్తిని దహనం చేసేప్పుడు బంగారం పెట్టే ఆనవాయితి ఉందని ఆ పసిడి కోసం తాము శ్మశాన వాటికల్లో అన్వేషిస్తున్నామని చెప్తున్నారు. అయితే మనిషి చనిపోయినప్పుడు వారి నోట్లో పెట్టే పసిడి పిసరంతా మాత్రమే. అది కూడా కాష్టంలో దొరుకుతుందో లేదో నమ్మకం లేదు కానీ ఈ మహిళలు మాత్రం పిసరంత బంగారం కోసం తాము శ్మశానాల్లో తిరుగుతున్నామని చెప్తుండడం అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు సుల్తానాబాద్ వాసులు. ఈ అంశాలంపై జరుగుతున్న చర్చ ఎలా ఉన్నా… వరస మరణాలు మాత్రం పట్టణ వాసులను కలవరపెడుతున్నాయి.