టార్గెట్ అధికార పార్టీ అభ్యర్థులు…వరస దాడుల కలకలం…

దిశ దశ, హైదరాబాద్:

నిన్న మొన్నటి వరకు వారిని చూడాలంటే అల్లంత దూరాన ఉండాల్సిన పరిస్థితి… నేడేమో వారిపైనే దాడులు జరుగుతున్న దుస్థితి… ఎందుకిలా జరుగుతోంది..? సెక్యూరిటీ లోపమా..? లేక సామాన్యుడిలో అసహనమా..? వరస దాడుల నేపథ్యం అధికార పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణల తీరు కూడా చర్చనీయాంశంగా మారింది.

దాడుల తీరిది…

ఎన్నికల రణరంగంలోకి దూకిన రెండు మూడు రోజుల్లోనే దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరిగింది. ఆయనపై జరిగిన దాడిని తనపై దాడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రత్యర్థులు తమపై దాడులు చేస్తున్నారంటే సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారంటూ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆ తరువాత ప్రచారం కోసం జనం మధ్యకు వెళ్లాల్సి వస్తోందన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ అభ్యర్థులకు 2 ప్లస్ 2 ఉన్న గన్ మెన్ల సంఖ్యను 4 ప్లస్ 4కు పెంచారు. సెక్యూరిటీ చర్యలు పకడ్భందీగా తీసుకున్నప్పటికీ అధికార పార్టీ నేతలపై మాత్రం దాడులు ఆగడం లేదు. పాలమూరు జిల్లాలో గువ్వల బాలరాజుపై దాడి జరగడంతో మరోసారి అధికార పార్టీ అభ్యర్థుల రక్షణ తీరుపై చర్చ సాగింది. ఆ తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైన సభలోనే ఓ అగంతకుండి వద్ద రెండు రౌండ్ల తూటాలు దొరికాయి. సీఎం సభావేదిక ప్రాంగణానికి అగంతకుడు రెండు తూటాలను ఎలా పట్టుకొచ్చారన్నదే పజిల్ గా మారిపోయింది. తాజాగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పై దాడి కలకలం సృష్టిస్తోంది. తన ప్రాణాలకు రక్షణ లేదని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేడిపల్లి సత్యం తనను హత్య చేసేందుకు కుట్ర పన్నాడంటూ సుంకె రవిశంకర్ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా పోలీసులు వీడియోలు తీసేందుకు ఆసక్తి చూపించారు కానీ తనపై జరిగిన దాడిని నిలువరించలేకపోయారని కూడా వ్యాఖ్యానించారు.

ఎలా సాధ్యం..?

ఓ వైపున 4 ప్లస్ 4 సెక్యూరిటీ ఉండగా మరో వైపున సివిల్ పోలీసులు కూడా అభ్యర్థులకు రక్షణ కవచంలా ఉంటున్నారు. అయినప్పటికీ ఈ దాడులు ఎలా జరుగుతున్నాయన్నదే అంతుచిక్కకుండా పోతోంది. అభ్యర్థులను టార్గెల్ చేసిన అగంతకులను ముందస్తుగానే గుర్తించడం విఫలం అవుతున్నదెవరూ..? ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైన సభలోకే అగంతకుడు రెండు రౌండ్ల తూటాలు తీసుకుని ఎలా వచ్చారు..? మెటల్ డిటెక్టర్లను దాటుకుని వీఐపీ జోన్ లోకి ఎలా ఎంటరయ్యాడు అన్నది మాత్రం అంతుచిక్కకుండా పోతోంది. సెక్యూరిటీ ప్రీకాషన్స్ తీసుకున్న తరువాత కూడా ఇలాంటి చర్యలు ఎలా జరుగుతున్నాయన్నదే మిస్టరీగా మారింది.

అడ్వాన్స్ పోలిసింగ్

ఉత్తర తెలంగాణాలో నక్సల్స్ ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో కూడా దట్టమైన అటవీ ప్రాంతాల్లోకి అభ్యర్థులు వెల్లి ప్రచారం నిర్వహించిన చరిత్ర ఉంది. ఇటీవలే ఎన్నికలు జరిగిన చత్తీస్ గడ్ లోని బస్తర్ జిల్లాలో కూడా నక్సల్స్ దాడులను కట్టడి చేయడంతో అభ్యర్థులు స్వేచ్ఛగా ప్రచారం చేసి వచ్చారు. ఇక్కడ జరిగిన ఎన్నికల్లో పారా మిలటరీ బలగాలు ప్రాణాలు వదిలాయి కానీ ఎన్నికల్లో పోటీ చేసిన వారంతా సేఫ్ గా ఉన్నారన్న విషయం గమనించాలి. తెలంగాణాలో ఇప్పుడు నక్సల్స్ ప్రభావితం కూడా అంతంత మాత్రమే ఉన్నక్రమంలో అధికార పార్టీ అభ్యర్థులే టార్గెట్ గా దాడులు జరుగుతుండడం మాత్రం విస్మయం కల్గిస్తోంది. నక్సల్స్ విధ్వంసాలతో చెలరేగిపోతున్నప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంలో టార్గెట్ అయిన ఓ నాయకుడు పర్యటించారు. అప్పుడు ఆయన్ని హతం చేసేందుకు వచ్చిన యాక్షన్ టీమ్ కదలికలను గుర్తించి వెంబండించి మరీ పట్టుకున్న చరిత్ర తెలంగాణ పోలీసుల సొంతం. అంతేకాకుండా అడవులు, గుట్టల్లో షెల్టర్ తీసుకున్న నక్సల్స్ ఉనికి దొరకబట్టి మరీ పోలీసులు వారిని సమూలంగా ఏరివేశారు. ఇప్పుడు కూడా మావోయిస్టులకు పట్టున్న చత్తీస్ గడ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు స్వేచ్ఛగా ప్రచారం చేస్తున్న సంగతి విధితమే. మునుగోడు ఎన్నికల సమయంలో హైదరాబాద్ శివార్లలో ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంపై పోలీసులు ముందస్తు దాడులు చేసి బీజేపీ కుట్రను భగ్నం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అటువంటి అడ్వాన్స్ పోలీసింగ్ నిర్వహిస్తున్న తెలంగాణాలో ఇలా దాడులు జరగడం, తూటాలతో అగంతకులు చిక్కడం వెనక పోలీసుల వైఫల్యం ఉందా లేక మరేదైన కారణం ఉందా అన్న విషయం తేలాల్సి ఉంది. కమాండ్ కంట్రోల్ లాంటి అధునాతన టెక్నాలజీతో రాష్ట్రం అంతా నిఘా నీడలో ఉన్నప్పుడు అగంతకులు దాడులు ఎలా చేస్తున్నారన్నదే అంతుచిక్కకుండా పోతోంది. ఎన్నో సాహసాలకు మారుపేరుగా నిలిచిన తెలంగాణ పోలీసులు తీరు గురించి ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా వచ్చి అవగాహన చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇండోనేషియాలో అత్యంత కఠినమైన ‘క్రెమోగో’ లాంటి శిక్షణ పొందిన వారు కూడా ఇక్కడే ఉన్నారు. అంతర్జాతీయ సెక్కూరిటీ కొనసాగించే దేశాల్లో తెలంగాణ అధికారులు విధులు నిర్వర్తించారు. అలాంటి ఘనమైన చరిత్ర ఉన్న తెలంగాణ పోలీసుల రక్షణ వలయంలో ఉన్న అధికార పార్టీ నాయకులపై దాడులు జరుగుతుండడం, వారిపై అటాక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండడం మాత్రం విచిత్రమనే చెప్పాలి.

You cannot copy content of this page