లీకులతో్ గందరగోళం…

కార్పోరేట్ సంస్థలకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వం

మావోయిస్టు పార్టీ నేత జగన్ ధ్వజం

దిశ దశ, వరంగల్:

రాష్ట్రంలో ఎగ్జామినేషన్ పేపర్లో లీకేజీలపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వరస ఘటనతో అటు నిరుద్యోగులు, ఇటు విద్యార్థుల్లో గందరగోళం నెలకొందని ఆందోళన వ్యక్తం చేసింది. కార్పోరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ వారి ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటనలో ఆరోపించారు. గ్రూప్స్ పేపర్ల లీక్, పదో తరగతి పేపర్లో లీక్, ఊట్నూరులో జవాబు పత్రాల గల్లంతు వ్యవహారాలపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించడం లేదని మండిపడ్డారు. ఈఘటనలను గమనిస్తే విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తును గాలికొదిలేసినట్టుగా కనిపిస్తోందని, లీకేజీలపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే బాధ్యతరాహిత్యంగా అలసత్వాన్ని ప్రదర్శిస్తోందని జగన్ దుయ్యబట్టారు. పాలనా పరమైన అంశాలను పక్కన పెట్టేసీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని కావాలని కలలు కంటూ రాష్ట్ర ప్రగతిని మర్చిపోయి, ప్రగతి భవన్ లో పార్టీ రాజకీయ వ్యవహారాలు నడుపుతున్నాడని ఆరోపించారు. స్వరాష్ట్రం సాకారం అయితే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని తెగించి కొట్లాడారని, ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థులు ప్రాణ త్యాగం చేయడంతో పాటు జైలు జీవితం గడిపిన వారూ ఉన్నారన్నారు. లాఠీల దెబ్బలు, తూటాలకు చిక్కి గాయాల పాలైన వారెందరో ఉన్నారని, విరోచిత పోరాటాల ఫలితం వల్లే తెలంగాణ ఏర్పడిందని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అన్నారు. రాష్ట్ర ఆవిర్భవించినప్పటికీ నీళ్లు, నిధులు నియామకాల మనకే దక్కుతాయని ఆశించినప్పటికీ ఆచరణలో మాత్రం కనిపించడం లేదన్నారు. రెండు లక్షల ఖాళీలు ఉన్నప్పటికీ ఉద్యోగాల భర్తీ మాత్రం చేయడం లేదని, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 80 వేల జాబ్స్ ఇస్తామని మోసపూరితమైన ప్రకటన చేశారన్నారు. 2022లో టెట్ అర్హత పొందిన వారంతా టీఆర్టీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని, ప్రభుత్వం నుండి మాత్రం సానుకూల స్పందన రావడం లేదని జగన్ అన్నారు. లీకేజీల వ్యవహారంలో ప్రభుత్వానికి కూడా సంబంధం ఉందని ఈ విషయంలో జవాబుదారీ తనం కూడా లేకుండా పోయిందని మావోయిస్టు పార్టీ నేత జగన్ విమర్శించారు. లీకేజీ వ్యవహారం విషయంలో నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాలు ఏకమై పోరాటం చేయాలని జగన్ పిలుపునిచ్చారు.

You cannot copy content of this page