దిశ దశ, హైదరాబాద్:
దేశ వ్యాప్తంగా 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిని కూడా పురస్కారాలను వరించాయి. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేసింది కేంద్రం. ఇందులో కనుమరుగవుతున్న అరుదైన కళలకు జీవం పోస్తున్న తెలంగాణ బిడ్డలకు కూడా అవకాశం కల్పించింది. పద్మ విభూషణ్ పురస్కారాలు భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, చిరంజీవిలకు వరించింది. కేంద్ర ప్రభుత్వం పద్మా అవార్డులు ప్రకటించిన తరువాత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ‘ఎక్స్’ వేదికగా పద్మ అవార్డులకు ఎంపికైన వారికి అభినందనలు తెలిపారు. మట్టిలో మాణిక్యాలుగా వెలుగొందుతున్న తెలుగు తేజాలు తెలంగాణాలోని దామరగిద్దకు చెందిన బుర్ర వీణ కళాకారుడు దాసరి కొండప్ప, జనగాం జిల్లాకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, ఏపీకి చెందిన హరికథా కళాకారిణి ఉమమహేశ్వరిలకు పద్మశ్రీ పురస్కాారాలు లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మరో వైపున తనతో పాటు పద్మ విభూషణ్ కు ఎంపికైన సినీ నటుడు చిరంజీవిని కూడా అభినందించారు వెంకయ్య నాయుడు. అలాగే తనకు పద్మ విభూషణ్ పురస్కారం లభించడంపై కూడా స్పందించిన ఆయన భారత ప్రభుత్వం అందించిన ఈ అవార్డను వినమ్రంగా స్వీకరిస్తున్నానని ప్రకటించారు.. దేశంలోని రైతులు, యువత, మహిళలు, నవ భారత నిర్మాణంలో భాగస్వాములు అవుతున్న వారందరికి తన అవార్డును అంకితం ఇస్తున్నానని వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఈ పురస్కారం తన భాధ్యతను మరింత పెంచిందని, శక్తివంతమైన ఆత్మ నిర్భర భారత నిర్మాణానికి ప్రజలతో కలిసి నడుస్తానని తెలిపారు.