2024 లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో దేశ రాజకీయాలు హీటెక్కాయి. జాతీయ స్థాయిలో వరుసగా రెండుసార్లు అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్.. దేశవ్యాప్తంగా పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర చేపట్టారు. ఈ యాత్రతో కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.
ఇప్పుడు భారత్ జోడో పాదయాత్ర ముగియడంతో.. కాంగ్రెస్ తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టింది. వచ్చే ఎన్నికల్లో కలిసొచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకోవడం, కొత్త పార్టీలను యూపీఏ కూటమిలో చేర్చుకోవడంపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా కాంగ్రెస్ దూకుడు పెంచింది. వచ్చే ఎన్నికల్లో దాదాపు 16 పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోనుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
పార్టీల పేర్లను కూడా మాణిక్యం ఠాగూర్ వెల్లడించారు. డీఎంకే ఆర్జేడీ ఎన్సీపీ జేడీయూ శివసేన(ఉద్దవ్ థాక్రే) జేఎంఎం ఐయూఎంఎల్ ఎండీఎంకే ఆర్ ఎస్పీ వీసీకే పీడీపీ ఎన్సీ కేరళ కాంగ్రెస్ (కేసీ) ఎంఎన్ఎం పేర్లును తెలిపారు. ఈ పార్టీలన్నింటికి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వం వహించనుందని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ లోని రాయపూర్‌లో ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. వామపక్ష పార్టీలను కూాడా కలుపుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం వామపక్ష పార్టీలు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో కలుస్తామంటూ ఒక స్టాండ్ తీసుకున్నాయి.దీంతో వామపక్ష పార్టీలు కూడా కాంగ్రెస్ తో కలిసే అవకాశముంది. ఇక కేసీఆర్ కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలుస్తారనే ప్రచారం ఉంది. కానీ దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా థర్డ్ ప్రంట్ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెబుతున్నారు.