స్ట్రాంగ్ రూం కీస్ మిస్సింగ్ పై ‘అడ్లూరి’ ఫైర్

దిశ దశ, జగిత్యాల:

జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లిలోని ఈవీఎంల స్ట్రాంగ్ రూం కీస్ మిస్సింగ్ మిస్టరీపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికారుల వైఫల్యంపై మండిపడ్డ ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ లు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం వీఆర్కే కాలేజీ వద్ద అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ… స్ట్రాంగ్ రూం తాళాలు మాయం కావడం ఏంటని ప్రశ్నించారు. హై కోర్టు ఆదేశాలతో 17ఏ, 17సీ ఫామ్స్ ఓపెన్ చేయాలని అధికారులు నిర్ణయించినప్పటికీ స్ట్రాంగ్ రూం కీస్ అదృశ్యం కావడంపై ప్రశ్నల వర్షం కురిపించారు. మద్యాహ్నం ఒంటిగంట దాటినా తాళం చేతులు దొరకలేదని, ఈ నెల4నే హై కోర్టు ఆదేశాలు ఇస్తే సోమవారం వరకూ తాళం చేతుల గురించి పట్టించుకోకపోవడం విస్మయం కల్గిస్తోందన్నారు. ఈవీఎం స్ట్రాంగ్ రూం కస్టోడియన్లుగా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు ఉంటారని వారి ఆధీనంలో ఉన్న తాళం చేతులు ఎలా పోయాయో అంతుచిక్కడం లేదని అడ్లూరి ఆందోళన వ్యక్తం చేశారు. పై అధికారులకు విన్నవిస్తే వెయిట్ చేయమన్నారని మూడు గంటలు అవతున్నా తాళాలు దొరకడం లేకపోవడం విచిత్రంగా ఉందన్నారు. దీనికి ప్రభుత్వ అధికారులు బాధ్యత వహించాలని ఎన్నికలప్పుడు ఉన్న శరత్ నుండి రవి, ఆయన నుండి యాస్మిన్ భాషాలు కలెక్టర్లుగా బాధ్యతలు తీసుకున్నారన్నారు. ఈ వ్యవహారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ జవాబు చెప్తారా లేక మంత్రి కొప్పుల ఈశ్వర్ జవాబు చెప్తారా తేల్చాలన్నారు. స్ట్రాంగ్ రూం కీస్ దొరకకపోవడానికి నిర్లక్ష్యానికి పరకాష్టనా లేక వ్యూహాత్మకమా అని ప్రశ్నించారు. కీస్ దొరకని విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి అక్కడి నుండే డైరక్షన్ తీసుకుంటామని అడ్లూరి లక్షణ్ కుమార్ స్పష్టం చేశారు.

You cannot copy content of this page