కాంగ్రెస్ పార్టీ వినూత్న నిరసన
దిశ దశ, కరీంనగర్:
నాలుగేళ్లయినా నిర్మాణ పనులు ప్రారంభం కాలేదంటూ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో చేపట్టిన నిరసన కార్యక్రమం హాట్ టాపిక్ గా మారింది. శిలఫలకం వరకే నిర్మణా పనులు పరిమితం అయ్యాయంటూ ఈ కార్యక్రమం నిర్వహించారు. చొప్పదండి నియోజకవర్గంలోని పలు మండలాలకు సాగు నీరు అందించేందుకు నాలుగేళ్ల క్రితం అట్టహాసంగా తూముల నిర్మాణం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. 2019లో శిలపలకాలు వేసినప్పటికీ ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా తీయలేదని, ఆయా కట్టు రైతులకు సాగు నీరెలా అందుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. రామడుగు మండలం షా నగర్ సమీపంలోని శిలాఫలకాల వద్దే పిండ ప్రధాన కార్యక్రమం నిర్వహించింది. చొప్పదండి ఇంఛార్జి మేడిపల్లి సత్యం ఆద్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా పిండ ప్రధానం నిర్వహించి ప్రభుత్వ పనితీరును ఎండగట్టిన మేడిపల్లి సత్యం మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వ పాలన కొత్తగా ఒక్క ఎకరాకు కూడా సాగు నీరందించలేదని మండిపడ్డారు. అసమర్థ ఎమ్మెల్యే కారణంగానే నియోజకవర్గంలోని ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయాయని మండి పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పథకాలను మంజూరు చేయడంతోనే సరిపెడుతూ… నిధులను విడదల చేయకుండా నియోజకవర్గ ప్రజలపై వివక్ష చూపుతోందని మేడిపల్లి సత్యం దుయ్యబట్టారు. ఇకనైనా పాలకులు, అధికారులు కళ్లు తెరిచి ఈ ప్రాజెక్టు నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
Disha Dasha
1884 posts
Prev Post