వైరల్ వీడియోపై స్పందించిన కాంగ్రెస్ నేత గుడాల శ్రీనివాస్
దిశ దశ, భూపాలపల్లి:
పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నాయకుడు గుడాల శ్రీనివాస్ డ్యాన్స్ చేస్తూ వెలుగులోకి వచ్చిన వీడియోలు సంచలనంగా మారాయి. మహదేవపూర్ జడ్పీటీసీ భర్త అయిన గుడాల శ్రీనివాస్ గతంలో కాళేశ్వరం దేవస్థాన ఛైర్మన్ గా కూడా పనిచేశారు. అయితే ఆయన సోమవారం ఉదయం మహదేవపూర్ పోలీస్ స్టేషన్ లో ‘‘నీ కోసం నీ కోసం’’ పాటపై డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో పోలీసు యంత్రాంగంపై, కాంగ్రెస్ పార్టీ నాయకులపై విమర్శలు వెల్లువెత్తాయి. స్టేషన్ లోనే డ్యాన్స్ చేయడమంటూ నెటిజన్లు దుయ్యబట్టారు. మార్నింగ్ వాక్ కోసం వెల్లిన గుడాల శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ లోపలకు వెల్లడం… మొబైల్ లో రికార్డు చేయడంతో పాటు ఆయనే దీనిని సోషల్ మీడియాలో వైరల్ చేసినట్టుగా తెలిసింది. ఈ వైరల్ వీడియో చూసిన ఇతర పార్టీ నాయకులుతో పాటు పలువురు విమర్శలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది.
అందరి కోసమే: గుడాల శ్రీనివాస్
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో ప్రధాన మీడియాల్లో కూడా ప్రసారం కావడంతో పోలీసు అధికారులు అలెర్ట్ అయ్యారు. అసలేం జరిగింది అన్న వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన అంశంపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుడాల శ్రీనివాస్ మరో వీడియో విడుదల చేశారు. రాజకీయాలతో పాటు ఉద్యోగాలు చేస్తున్న వారు చాలా మంది కూడా ఒత్తిళ్లకు గురువుతున్నారని రిలాక్స్ అయ్యేందుకు యోగాతో పాటు కొన్ని పద్దతుల ద్వారా ఉల్లాసాన్ని పొందవచ్చని కొంతమంది సలహా ఇచ్చారన్నారు. ప్రజలతో మనశ్శాంతిగా మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పడంతో… ఒత్తిడి నుండి ఉపశమనం గురించి తాను అందరికి వివరిస్తూ వెల్తున్న క్రమంలో సోమవారం మహదేవపూర్ పోలీస్ స్టేషన్ లో డ్యాన్స్ చేశానన్నారు. స్టేషన్ అధికారి ఒకరు అక్కడ ఉండడం వల్ల అతనికి ఉల్లసంగా ఉండడమేలా అని వివరించేందుకు వ్యాయామం చేయాలంటే, డ్యాన్స్ ద్వారా కూడా చేయవచ్చని వివరించానని అన్నారు. దీనివల్ల ఆరోగ్యం బావుండడంతో మానసికోల్లాసం ఉంటుందని చెప్పి వారిలో అవగాహన కల్పించేందుకే డ్యాన్స్ చేశానని గుడాల శ్రీనివాస్ వెల్లడించారు. ఈ వీడియో కూడా తానే తీయించి నలుగురికి తెలియాలని వైరల్ చేశానని, కొంతమంది దుష్ప్రచారం చేశారన్నారు. కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోగ్యమే మహాభాగ్యం అన్న భావనతోనే తానీ వీడియో తీశానని తెలిపారు.
మరిన్ని వివరాలకు ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి