దిశ దశ, కరీంనగర్ం
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడవచ్చంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని గద్దె దింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంటూ సంజయ్ చేసిన కామెంట్స్ సరికొత్త చర్చకు దారి తీస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రికి టచ్ లో ఉన్నారంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఆదివారం కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… పార్లమెంటు ఎన్నికల తరువాత రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చన్న బండి సంజయ్ కేసీఆర్ కు ప్రజా స్వామ్యంపై నమ్మకం లేదని ఆరోపించారు. కుట్రలకు కేరాఫ్ గా నిలిచారని, రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పోరాటం తర్వాత చేసుకుందామని ముందు బీఆర్ఎస్ ను బొందపెట్టేందుకు కలిసి రావాలని సంజయ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ కదలికలపై ఓ కన్నెసి ఉంచాలని సూచించారు. తెలంగాణలో అన్నింటా అభివృద్ది చెందాలంటే బీజేపీకి ఎక్కువ సంఖ్యలో ఎంపీలు గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావాలన్నా బీజీపీ ఎంపీలను గెలిపించాలని కోరారు. యాదాద్రిని వ్యాపార కేంద్రంగా మార్చింది కేసీఆరేనని, ఆలయంలో ఆయన బొమ్మ చెక్కించుకున్నాడని బండి సంజయ్ మండిపడ్డారు. ప్రధాని మోడీ అయోధ్యలో తన బొమ్మ చెక్కించుకోవడం కానీ ఆ ప్రాంతంలో భూములు కొనడం కానీ చేయలేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ధార్మిక కేంద్రాన్ని వివాదస్పదం చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అయోధ్య శ్రీరామని ప్రాణ ప్రతిష్టకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ భద్రాద్రి రామయ్య కళ్యాణానికి తలంబ్రాలు తీసుకపోలదని, వేములవాడ అభివృద్దికి వందల కోట్లు కెటాయిస్తామన్నాడు కానీ ఆచరణలో పెట్టలేదని దుయ్యబట్టారు. రాజన్న ఆలయానికి చెందిన నిధులను ఇతర ప్రాంతాలకు మల్లించాలని చూశారని బండి సంజచ్ ఆరోపించారు. తెలంగాణ పదాన్ని వదిలేసుకున్న తరువాత బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీనా.. జాతీయ పార్టీనా అన్నదే అంతుచిక్కకుండా పోయిందన్నారు. గల్లీలో ఎవరున్నా… ఢిల్లీలో మోడీ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. వచ్చే
ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఊసే ఉండదని ఆ పార్టీ తరుపున పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రావడం లేదని వ్యాఖ్యానించారు.