ఎవరిదా కారు… తిరుగుతున్నదెవరూ..?
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వైరల్ అవుతున్న ఓ ఫోటో సరికొత్త చర్చకు దారి తీస్తోంది. గణతంత్ర దినోత్సం రోజున వైట్ కలర్ కారు ఒకటి కరీంనగర్, జగిత్యాల రహదారిలో సంచరించింది. అయితే ఈ కారును సునిశితంగా పరిశీలించిన వారు ఆశ్చర్యానికి గురై ఫోటో తీసినట్టుగా అనిపిస్తోంది. ఇంతకీ ఆ కారులో వారికి కనిపించిదేమిటీ..? అందులో ప్రయాణిస్తున్న వారు ఎవరూ అన్న అనుమానం ప్రతి ఒక్కరికి రాక తప్పదు.
స్టిక్కర్ ఒకరిది…
కారు డ్యాష్ బోర్డుపై బీజేపీ పార్టీకి చెందిన కండువా కనిపిస్తుండగా, కారు ఫ్రంట్ మిర్రర్ కు కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు ఎమ్మెల్యే, మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) పేరిట అంసెంబ్లీ కార్యాలయం విడుదల చేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ కార్ పాస్ అని రాసి ఉండగా ఈ ఏడాది మార్చి 31 వరకు గడువు ఉన్నట్టుగా కూడా ముద్రించి ఉండడం గమనార్హం. తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ సంతకం చేసినట్టుగా కూడా ఉన్న ఈ పాసు కారుకు ఉండడం ఏంటీ..? అదే కారు డ్యాష్ బోర్డుపై బీజేపీ పార్టీకి చెందిన కండువా ఉండడం ఏంటన్నదే మిస్టరీగా మారింది. సాధారణంగా ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులు ప్రయాణించే వాహనాలకు అసెంబ్లీ కార్యదర్శి కారు పాసులను విడుదల చేస్తుంటారు. గడువు పూర్తయిన తరువాత కొత్త కారు పాసులు ఇస్తుంటారు. అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేరిటనే విడుదల అయ్యే ఈ కారు పాసులను సాధారణ వ్యక్తులు అయితే వినియోగించే అవకాశం అయితే ఉండదు. సదరు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీలకు అత్యంత సన్నిహితులు అయితే తప్ప కారు పాసులను వినియోగించే అవకాశం ఉండదని తెలుస్తోంది. అయితే ఆదివారం కరీంనగర్, జగిత్యాల రహదారిపై సంచరించిన ఓ వాహనానికి ఈ కారు పాస్ ఉండడం, అందులో బీజేపీ పార్టీ గుర్తు కమలం ముద్రించిన కండువా ఉండడం విశేషం. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ప్రస్తుతం మంత్రి కూడా అయిన సీతక్క పేరిట విడుదల అయిన పాస్ వినియోగిస్తున్న వాహనాలో బీజేపీ పార్టీకి చెందిన కండువా ఉండడం ఎంటన్నదే అంతు చిక్కకుండా పోతోంది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ములుగు జిల్లా కేంద్రం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న సీతక్క పేరిట జారీ అయిన కార్ పాస్ తో ఉన్న వాహనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తిరగడం ఏంటన్న చర్చ కూడా సాగుతోంది.