దిశ దశ, హైదరాబాద్:
కాంగ్రెస్ పార్టీ జంప్ జిలానీలకు బ్యాడ్ న్యూస్ వినిపిస్తున్నట్టుగా ఉంది. ఫిరాయింపులతో పబ్బం గడుపుకోవాలని చూసే వారికి షాకింగ్ న్యూసే ఇది. అధికారంలో ఉన్న పార్టీ నేతలకు దగ్గర కావడం చక్రం తిప్పడం తాము అనుకున్నది సాధించడం రివాజుగా మారిపోయింది కొంతమందికి. అయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నెమ్మదిగా తమ మనసులో మాట బయట పెడుతున్నారు. కష్టమైనా నష్టమైనా తమ వెంటే నడిచిన క్యాడర్ ను మాత్రమే అక్కున చేర్చుకుంటాం కానీ ఇతర పార్టీల నుండి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతాం అన్న వారికి మాత్రం నో ఎంట్రీ అని కుండబద్దలు కొడుతున్నారు. తమకు అధికారం రాగానే పంచన చేరేందుకు ఉవ్విళ్లూరుతున్న వారికి ఊసురుమనిపించేలా తమ కఠిన నిర్ణయాన్ని చెప్పేస్తున్నారు. హైదరాబాద్ కు వెల్లి మరీ ఒకరిద్దరు మంత్రుల ప్రాపకం కోసం ప్రయత్నించిన వారికి కూడా వారికి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని కూడా ప్రచారం జరుగుతోంది. అలాగే జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఇతర పార్టీల నుండి తమ పార్టీలోకి వలస వచ్చే వారిని రానివ్వమని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ జెండా మోసి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న వారికి మాత్రమే అందలం ఎక్కిస్తామని స్పష్టం చేశారు. దీంతో అధికార పార్టీ నేతల పంచన చేరి పదవులు పొందడమో లేక ఇతర రకాలుగా లాభం పొందాలని అంచనా వేసుకున్న నాయకులు నీరుగారిపోయారు. సర్కారు ఎవరిదైతే ఏం మేం బాగుంటాం అలాగే మా స్కెచ్ లు మాకుంటాయని చెప్పుకుంటూ కాలం వెల్లదీసిన నాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు కన్నెత్తి చూసే అవకాశం కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యేలు ప్రకటించిన తీరు చర్చనీయాంశంగా మారింది.
దళారుల కొత్త పల్లవి…
ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో చెట్టాపట్టాలేసుకుని తిరిగి వారి పతనానికి కారకులైన కొంతమంది దళారులు సరి కొత్త పల్లవి అందుకుంటున్నారు. గత ప్రభుత్వంలోనే కాదు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ముఖ్యమంత్రి నుండి ఎమ్మెల్యేల వరకు తమకు సన్నిహితులుగా ఉన్నరంటూ ప్రచారం చేయడం ఆరంభించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ దళారి అయితే రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైన ప్రజాప్రతినిధితో తనకు అత్యంత చనువు ఉందని చెప్పకుంటున్నాడు. పోలీసు పోస్టింగులే అయినా రెవెన్యూ పోస్టింగులే అయినా తాను డైరక్ట్ ఆ ముఖ్య నేతకు చెప్పి అన్ని సెట్ చేస్తానంటూ ప్యాకేజీలకు శ్రీకారం చుట్టాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే సరైన అధికారులను ఎంపిక చేస్తూ బదిలీల ప్రక్రియ కొనసాగిస్తోంది. కొంతమంది క్షేత్ర స్థాయి అధికారుల బదిలీలు వెంటనే జరపకపోవడానికి వేరే కారణాలు ఉన్నప్పటికీ సదరు దళారీ మాత్రం గత ప్రభత్వం పోస్టింగ్ ఇచ్చిన విధంగానే కొనసాగించేందుకు ముఖ్యనేతను ఒప్పిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నట్టుగా సమాచారం. దీంతో మళ్లీ అదే దళారీ రాజ్యం మొదలవుతుందా అన్న ఆందోళన అన్ని వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని వెలగబెట్టిన ఆ పార్టీ నాయకులే కాకుండా దళారీల విషయంలోనూ ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.