గిన్నె… గిలాస… గంటె…

కాంగ్రెస్ పార్టీ వినూత్న నిరసన

దిశ దశ, రాజన్న సిరిసిల్ల జిల్లా:

ఆయనొచ్చినప్పుడల్లా వీళ్లకు తిప్పలు తప్పడం లేదు… ఆయన వచ్చేసరికి అందరూ స్టేషన్లలో అటెండెన్స్ వేసుకోవల్సిందే. ఆ వీవీఐపీ టూర్ ఉందంటే ముందుగా అలెర్ట్ కావల్సింది పోలీసులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు. పోలీసులు ప్రతిపక్ష పార్టీల నాయకులకు బలవంతపు ఆతిథ్యం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంటే… ఆ జిల్లాలోని ఠాణాలకు నిత్యం వీరు స్పెషల్ గెస్టులుగా మారిపోయారు. అయితే నిత్యకృత్యంగా మారిన అరెస్టుల పర్వంతో విసుగెత్తిన కాంగ్రెస్ నాయకులు తమ స్టైల్ నిరసనకు తెరలేపారు. మీరు మమ్మల్ని బలవంతంగా పట్టుకెళ్లడం ఎందుకు సమాచారం ఇచ్చారుగా మేమే వస్తున్నాం అంటూ కాంగ్రెస్ నాయకులు వినూత్నంగా నిరసనలు చెప్తూ స్టేషన్ కు చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది.

తంగెళ్లపల్లి స్టేషన్ కు వెల్తున్న కాంగ్రెస్ నాయకులు

అక్కడేం జరుగుతోంది..?

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గంలో అత్యంత విచిత్ర పరిస్థితులు నెలకొన్నయనే చెప్పాలి. ఇక్కడి నుండి శాసనసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి కేటీ రామారావు తరుచూ పర్యటను చేస్తుంటారు. అయితే ఆయన వచ్చిన ప్రతిసారి కూడా ప్రతిపక్ష పార్టీలు, నేరెళ్ల బాధితులు బయటకు రాకుండా ఉండేందుకు ముందస్తు అరెస్టులకు శ్రీకారం చుట్టారు పోలీసులు. తొమ్మిదేళ్లుగా సాగుతున్న ఈ తంతుతో ప్రతిపక్ష పార్టీల నాయకుల పరిస్థితి ఏలా మారిందంటే ఇంట్లో అత్యవసరం పని ఉన్నా ముఖ్యమైన కార్యక్రమం ఉన్నా స్టేషన్ లో అటెండెన్స ఇవ్వాల్సిందే… మంత్రి కేటీఆర్ తిరుగు ప్రయాణం అయ్యేవరకూ అందులోనే వేచి చూడాల్సిందే. అమాత్యుని టూర్ షెడ్యూల్ ఖరారు అయిందంటే చాలు పోలీసులు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగడం, వారంతా స్టేషన్లకు చేరుకోవడం కామన్ గా మారిపోయింది. తొమ్మిదేళ్లుగా సాగుతున్న ఈ తంతుతో విసిగి వేసారిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వైవిద్యంగా నిరసన తెలిపారు. బుధవారం మంత్రి కేటీఆర్ టూర్ షెడ్యూల్ ఫిక్స్ కాగానే తెల్లవారు జామునే పోలీసులు ఆయా పార్టీల నాయకుల ఇళ్లలోకి వెల్లి వారందరిని అదుపులోకి తీసుకున్నారు. ఇళ్లలో అందుబాటులో లేని నాయకులను స్టేషన్ కు పంపించాలని వారి కుటుంబ సభ్యులకు పోలీసులు చెప్పి వెళ్లారు. దీంతో విసుగు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులు వచ్చే వరకు వేచి చూడకుండా వారే స్వచ్ఛందంగా స్టేషన్లకు వెల్లిపోయారు. కాకపోతే చిన్న ట్విస్ట్ ఇచ్చి మరీ ఆ నాయకులు గిన్నె, గిలాస, గంటెలు పట్టుకుని చప్పుడు చేసుకుంటూ అక్రమ నిర్భందాలపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లోని దుస్థితి సిరిసిల్లలో నెలకొందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కనీసం తాము ఆందోనలు చేస్తామని పిలుపు ఇవ్వకున్న అరెస్ట్ చేయడం ఏంటని తంగెళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ టోనీ ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ టూర్ ఉందంటే పోలీసులు రావడం మమ్మల్ని స్టేషన్లకు తరలించడం సర్వ సాధారణంగా మారిపోయిందని, ఈ పరిస్థితిలో మార్పు రావాలన్న ఆకాంక్షతో తామే స్వచ్ఛందంగా ఠాణాకు వెల్లామని వివరించారు. ఈ సందర్భంగా అక్రమ అరెస్టులను నిరసిస్తూ తాము ప్లేటు, గ్లాసు, గంటె, గిన్నెలు పట్టుకుని నినాదాలు ఇస్తూ స్టేషన్ కు చేరుకున్నామన్నారు. ఈ నిరసనలతో అయినా తమ ఇబ్బందులను గుర్తించి ఇలాంటి అక్రమ అరెస్టులకు బ్రేకులు వేయాలని ఆకాంక్షిస్తున్నామని ప్రవీణ్ టోనీ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ గౌడ్, ఆరేపల్లి బాలు, శ్రీకాంత్, శ్యాం, బాలసాని శ్రీనివాస్, చిలుక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page