కొల్లాపూర్ బరిలో కాంగ్రెస్ రెబల్ జగదీశ్వర్ రావు

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా బరిలోకి…

దిశ దశ, మహబూబ్ నగర్:

మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. పార్టీలు మారుతూ నాయకులు తమ భవిష్యత్తును పరీక్షించుకునేందుకు సిద్దపడుతున్నారు. తాజాగా కొల్లాపూర్ నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ జగదీశ్వర్ రావు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి పోటీ చేసేందుకు సమాయత్తం అయ్యారు. ఈ మేరకు ఏఐఎఫ్బీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి జగదీశ్వర్ రావును పార్టీలో జాయిన్ చేసుకున్నారు. వెంటనే ఆయనకు ఏ, బి ఫారాలను కూడా అందజేశారు. దీంతో కొల్లాపూర్ ముఖచిత్రంలో బహుముఖ పోటీ తప్పేలా లేదు.

ముల్లును ముల్లుతోనే…

కొల్లాపూర్ నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇక్కడి నుండి గతంలో చట్ట సభకు ప్రాతినిథ్యం వహించిన జూపల్లి కృష్ణారావు గులాభి గూటికి చేరారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో పొసగకపోవడంతో జూపల్లి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూపల్లి రాకతో పార్టీ టికెట్ ఆశించిన వారి పరిస్థితి అయోమయంలో పడిపోయిందన్న ఆందోళనలు వ్యక్తం అయినప్పటికీ పార్టీ అధిష్టానం మాత్రం పట్టించుకోలేదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోక తప్పదని పార్టీ సీనియర్ శ్రేణులు భావించారు. జూపల్లి కాంగ్రెస్ పార్టీని వీడిన తరువాత కూడా తాము పార్టీని బలోపేతం చేశామని అయినప్పటికీ తమకు సరైన న్యాయం జరగలేదని కొల్లాపూర్ పార్టీ క్యాడర్ నైరాశ్యానికి గురైంది. ఈ క్రమంలో జగదీశ్వర్ రావు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి పోటీ చేయాలని నిర్ణయించుకుని ఈ మేరకు ఏఐఎఫ్బీ నాయకత్వంతో సమాలోచనలు జరిపారు. అయితే జగదీశ్వర్ రావు సింహం గుర్తుపై పోటీ చేసేందుకు భారీ కసరత్తు చేసినట్టుగా తెలుస్తోంది. గులాభి పార్టీ అధిష్టానం పెద్దలతో జూపల్లికి మధ్య గ్యాప్ ఏర్పడిన తరువాత జరిగిన స్థానిక ఎన్నికల్లో ఏఐఎఫ్బీ పార్టీ తరుపున ప్రజా ప్రతినిధులు పోటీ చేశారు. ఇక్కడి నుండి సింహం గుర్తుపై నుండి పోటీ చేసిన వారు కూడా గెలవడంతో ఈ గుర్తు నియోజకవర్గ ఓటర్లలో నానుతోంది. ఈ క్రమంలో ఏఐఎఫ్బీ తరుపున పోటీ చేస్తే గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లడం చాలా సులువు అవుతుందని అంచనా వేశారు. అంతేకాకుండా నియోజకవర్గంలో తనకు జరిగిన అన్యాయం వల్ల వచ్చిన సానుభూతి, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత కూడా తనకు కలిసి వస్తుందని అంచనా వేసిన జగదీశ్వర్ రావు సింహం గుర్తుపై పోటీ చేసేందుకు ముందుకు సాగినట్టుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తన వర్గాన్ని సింహం గుర్తుపై పోటీ చేయించిన జూపల్లి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి తనకు తీరని అన్యాయం చేశారని జగదీశ్వర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. జూపల్లి వల్ల కల్గిన నష్టంపై ప్రతీకారం తీర్చుకునేందుకు రెబెల్ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలుకు జూపల్లి వర్గం కారణంగా సుపరిచతమైన సింహం గుర్తుపైనే పోటీ చేస్తే అన్నింటా లాభం జరుగుతుందని జగదీశ్వర్ రావుకు సన్నిహితులు సూచించినట్టు సమాచారం. దీంతో వెంటనే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపి కొల్లాపూర్ అభ్యర్థిగా ఆ పార్టీ తరుపున పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. తనకు ఉన్న ఇమేజ్ కు తోడు సింహం గుర్తు కూడా కలిసివస్తే సానుకూల ఫలితాన్ని రాబట్టే అవకాశాలు ఉన్నాయని జగదీశ్వర్ రావు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కొల్లాపూర్ నియోజవర్గంలో కాంగ్రెస్ పార్టీ రెబల్ గా బరిలో నిలుస్తుండడంతో ఎలాంటి ఫలితాలు వస్తాయోనన్న చర్చ కూడా సాగుతోంది.

You cannot copy content of this page