అసెంబ్లీ ఎన్నికల తీరు…
దిశ దశ, హైదరాబాద్:
అసెంబ్లీ ఎన్నికల్లో పెరుగుతున్న సానుభూతి పవనాలు ఓ పార్టీ అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేస్తున్నట్టుగా ఉండగా… తమపై వస్తున్న వ్యతిరేకతను అధిగమించేందుకు అధికారపార్టీ తమ వ్యూహాలకు పదునుపెడుతూ ప్రజలతో మమేకం అయ్యే విధంగా దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది.
ఎన్నికల వాతావరణంతో…
కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వచ్చిన అనుకూలతను పసిగట్టి అధికారమే లక్ష్యంగా పావులు కదిపింది. పార్టీ ముఖ్య నాయకులు అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రచారం విషయంలోను జాగ్రత్తలు తీసుకుని ముందుకు సాగింది. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తమలోని కాన్ఫిడెన్స్ లెవల్స్ పెంచుకున్నట్టుగా పలు సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. కొన్ని చోట్ల ఈ అతి నమ్మకంతో అభ్యర్థులు మొక్కుబడి ప్రచారాలకే పరిమితం అవుతున్నారన్న చర్చ మొదలైంది. కొన్ని నియోజకవర్గాల్లోని అభ్యర్థులు జాయినింగ్స్ కే ఎక్కువ ప్రాధానత ఇస్తూ గ్రౌండ్ లెవల్ క్యాంపెయిన్ ను పక్కనపెట్టేసినట్టుగా తెలుస్తోంది. మరి కొన్ని చోట్ల అభ్యర్థులు వ్యవహరిస్తున్న తీరు ద్వితీయ శ్రేణి నాయకత్వానికి కమ్యూనికేషన్ గ్యాప్ పెరుగుతుందన్న ఆందోళన కూడా వెలిబుచ్చుతున్న వారూ లేకపోలేదు. ఈ సారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలన్న లక్ష్యంతో అధిష్టానం పెద్దలు క్రియాశీలకంగా పనిచేస్తుంటే ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు ప్రదర్శిస్తున్న ధీమా మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. స్వచ్ఛందంగా వచ్చిన అనుకూలతను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాల్సింది పోయి విసుగు పడడం వంటి చర్యల ఎక్కవయ్యాయన్న చర్చ సాగుతోంది.
అధికార బీఆర్ఎస్ పార్టీ ఇలా…
అసెంబ్లీ ఎన్నికలు సమీపించగానే తెలంగాణ ప్రజల్లో అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత తెరపైకి వచ్చింది. అప్పటి వరకు తమ గెలుపు నల్లేరుపై నడకేనని భావించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు ప్రజల నాడిని గమనించారు. ప్రజా క్షేత్రంలో తమపై ఉన్న వ్యతిరేకతను, కాంగ్రెస్ పార్టీపై వస్తున్న సానుకూలతను స్ఫష్టంగా గమనించారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఎప్పటికప్పుడు వివిధ క్షేత్రాల ద్వారా ప్రజల నాడిని తెలుసుకుంటూ అనుకూల వాతావరణం ఏర్పడేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు అభ్యర్థులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రధానంగా ప్రజలకు, బీఆర్ఎస్ అభ్యర్థులకు ఏర్పడిన అంతరాన్ని తగ్గించుకునే దిశగా చొరవ చూపాలని, ప్రజల్లోకి వెల్లిపోయి తమ వైఖరిలో మార్పు వచ్చిందన్న సంకేతాలు ఇచ్చే విధంగా నడుచుకోవాలని పార్టీ అధిష్టానం స్పష్ఠమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో తీవ్రమైన వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాలోని అభ్యర్థులు తమ ప్రచారం తీరు తెన్నులనే మార్చేస్తున్నారు. రోజూ ఇంటలీజెన్స్ వర్గాలతో పాటు ప్రైవేటు ఏజెన్సీల నుండి తెప్పించుకుంటున్న ఫీడ్ బ్యాక్ తో బీఆర్ఎస్ అధిష్టానం క్షేత్ర స్థాయిలో చేసే క్యాంపెయిన్ విషయంలో అప్ డేట్ చేస్తోంది. దీంతో చాలా మంది బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజల మధ్య ఉండేందుకే ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇస్తున్నారు.