లిక్కర్ స్కాంలో కుట్ర పన్నారు… కవిత అరెస్ట్ పై ఈడీ ప్రకటన…

దిశ దశ, న్యూ ఢిల్లీ:

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 15న కవితను అరెస్ట్ చేస్తున్న సందర్భంలో ఆమె బంధువులు అడ్డుకున్నారని పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనతో పాటు అమలు చేసే విషయంలో కవిత, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు కలిసి కుట్ర పన్నారని తమ దర్యాప్తులో వెల్లడైనట్టు ఈడీ వివరించింది. ఈ అనుమతులు ఇచ్చినందుకు ఆఫ్ నేతలకు రూ. 100 కోట్ల ముడుపులు ఇచ్చారని, ఈ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. ఈ మొత్తాన్ని కూడా హోల్ సేల్ వ్యాపారుల నుండి ఇప్పించారని లాభాల రూపంలో ఆ డబ్బును రాబట్టుకునేందుకు పథకం వేశారని ఈడీ తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబైతో పాటు మొత్తం 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్టు వివరించింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయక్ తో పాటు 15 మందిని అరెస్టు చేశామని, అలాగే ఒక ఛార్జిషీట్, నాలుగు అదనపు ఛార్జ్ షీట్లను దాఖలు చేసినట్టు కూడా ఈడీ తెలిపింది. అంతేకాకుండా రూ. 128.79 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేయగా అడ్జుడికేటింగ్ అథారిటీ కూడా ఆమోదించినట్టు వెల్లడించింది.

You cannot copy content of this page