నన్ను చంపేందుకు కుట్ర: ఇనుముల సతీష్

దిశ దశ, మంథని:

తప్పుడు కేసులు నమోదు చేయించి, అంగరక్షకులను తొలగించిన  తరువాత తనను చంపేందుకు కుట్రలు పన్నుతున్నారని పెద్దపల్లి డీసీసీ అధికార ప్రతినిధి, అడ్వకేట్ ఇనుముల సతీష్ ఒక ప్రకటనలో ఆరోపించారు. బీసీ బిడ్డను కాబట్టే తనపై కక్ష్యగట్టారని, అక్రమాలను ప్రశ్నించినందుకే తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వెల్లడించారు. తనపై కేసు నమోదు చేసిన వ్యక్తికి సంబంధించిన భవనంపై తాను ఏనాడు కేసు నమోదు చేయలేదని, ఆ ఇంటి నిర్మాణం పూర్తయిందని, ఇంటి నంబర్ కూడా తీసుకుని వ్యాపారులకు అద్దెకు ఇచ్చుకున్నారని సతీష్ వెల్లడించారు. రాబోయే మునిసిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది వెనుక ఉండి బీసీ అయిన తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయాలని భావించి తప్పుడు ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. గతంలో మంథని ప్రాంతంలో జరిగిన హత్యల నేపథ్యంలో ప్రాణ రక్షణ కోసం తనకు కెటాయించిన గన్ మెన్లను తొలగించేందుకు ప్రస్తుతం నమోదయిన తప్పుడు కేసును బూచిగా చూపించడంతో పాటు కోర్టుల్లో కొట్టివేసిన పాత కేసులను చూపించే ప్రయత్నాలు చేస్తున్నారని ఇనుముల సతీష్ ఆరోపించారు. తాను కోర్టులో వేసిన పిల్ కు మంథనిలో కూల్చివేతలకు ఎలాంటి సంబంధం లేదని, కావాలని తనపై నిందలు మోపుతున్నారన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శ్రీను బాబు గార్ల నాయకత్వంలో మరింత చురుగ్గా పనిచేస్తానని, వారి మర్యాదలకు భంగం కల్గించే విధంగా వ్యవహరించనని స్పష్టం చేశారు. తాను ఏ తప్పూ చేయలేదని, నిరూపణ జరిగితే ఎలాంటి శిక్షకైనా సిద్దమేనని వెల్లడించారు. గత 12 ఏళ్లుగా తనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని, పట్టణంలో ఎవరిని బెదిరించలేదని, వాస్తవాలు అన్ని కూడా ప్రలజకు తెలుసని అన్నారు. ప్రతి పక్ష పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కారణంగానే తనపై ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని ఇనుముల సతీష్ ఆ ప్రకటనలో ఆరోపించారు.

You cannot copy content of this page