దిశ దశ, కరీంనగర్:
కానిస్టేబుల్ నాగముత్యం ఆణిముత్యంలా మెరిసిపోయి ఆ కుటుంబానికి ప్రత్యక్ష్యంగా దైవంగా నిలిచిపోయాడు. భక్తులతో కిటకిటలాడిపోతున్న ఆలయంలో విధుల్లో ఉన్న ఆయన చురుగ్గా స్పందించిన తీరు ప్రతి ఒక్కరి అభినందనలు అందుకుంటోంది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… ములుగు జిల్లా మేడారం శ్రీ సమ్మక్క, సారాలక్క జాతర సమీపంలో అనూహ్యంగా ఓ భక్తుడు పడిపోయాడు. అక్కడే డ్యూటీలో ఉన్న తోట నాగముత్యం అనే కానిస్టేబుల్ వెంటనే అతన్ని కాపాడేందుకు సీపీర్ చేశాడు. కార్డియాక్ అరెస్ట్ కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్న సదరు భక్తుడిని కాపాడేందుకు నాగముత్యం స్పందించిన తీరు ప్రతి ఒక్కరి మన్ననలు అందుకుంది. భక్తుడు రాజయ్య కుటుంబీకులు అతనికి ఏమైందోనన్న టెన్షన్ లో ఉండగా, విధుల్లో తలమునకలై ఉన్న కానిస్టేబుల్ నాగముత్యం కార్డియాక్ అరెస్ట్ అయిందన్న విషయాన్ని గమనించి సీపీఆర్ చేశారు. లేనట్టయితే మేడారం ఆలయ సన్నిధిలోనే ఆ భక్తుడి శ్వాస అనంతవాయువులో కలిసిపోయేది. నాగముత్యం అందించిన ఈ సేవలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కానిస్టేబుల్ తోట నాగ ముత్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పని చేస్తున్నారని, మేడారం భక్తుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేకంగా డ్యూటీ వేశారని తెలిసింది. కానిస్టేబుల్ నాగముత్యం అందించిన స్పూర్తిని ఆదర్శంగా తీసుకున్నట్టయితే కార్డియక్ అరెస్ట్ అయిన చాలా మందిని కాపాడే అవకాశం ఉంటుంది. కానిస్టేబుల్ నాగముత్యం సీపీఆర్ అందించి ఒకరి ప్రాణాలు కాపాడిన తీరుపై భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు. ఇలాంటి ఆదర్శవంతమైన సేవలు అందించాలని పిలుపనిచ్చారు.